మే 1వ తేదీన కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని సినీ పరిశ్రమలోని ఇరవై నాలుగు విభాగాలతో కలిసి ఉత్స వాల్ని నిర్వహించేందుకు ఫిలిం ఫెడరేషన్ సన్నాహాలు చేస్తున్నది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని మాట్లాడుతూ ‘ఈ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతారు.
ఆయనతో పాటు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్‌గారు, సబితాఇంద్రారెడ్డి కూడా వేడుకలో పాలుపంచుకుంటారు’ అని అన్నారు. ఈసారి వేడుకల్ని భారీ స్థాయిలో నిర్వహించబోతున్నామని, పదివేల మంది కార్మికులు వారి కుటుంబాలతో కలిసి పాల్గొంటారని తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫిలిం ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ దొరై, ట్రెజరర్ సురేష్, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ కొల్లి రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవెంట్ బ్రోచర్‌ను విడుదల చేశారు.