బీజింగ్, నవంబర్ 23: రెండేండ్ల ఆ చిన్నారి మృత్యు కౌగిలిలో ఉన్నాడు. ప్రతి లక్ష మందిలో ఒకరికి వచ్చే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. సరైన చికిత్స అందించకపోతే బాబు ప్రాణాలు ఏ క్షణమైనా పోవచ్చు. విషయం తెలుసుకున్న బిడ్డ తండ్రి గ్జూవీయ్ అల్లాడిపోయాడు. చికిత్స కోసం చైనా వ్యాప్తంగా వైద్యులను సంప్రదించాడు. అయితే వ్యాధిని నయం చేసే ఔషధాలు ఆ దేశంలో అందుబాటులో లేవని తెలిసింది.
విదేశాలకు వెళ్దామంటే, కరోనా సంక్షోభంతో సరిహద్దులను మూసేశారు. ప్రత్యేక అనుమతుల కోసం ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో హైస్కూల్ విద్యను కూడా పూర్తిచేయని గ్జూవీ.. బిడ్డ కోసం శాస్త్రవేత్త అయ్యారు. తన తండ్రి నడుపుతున్న జిమ్‌లో ఓ ప్రయోగశాలను ఏర్పాటు చేశాడు. శరీరంలో కాపర్ లోపం వల్లనే తన కొడుకు హావోయంగ్కు ‘మెంకెస్’ సిండ్రోమ్ వచ్చిందని తెలుసుకున్నాడు. మెదడు, నాడీ వ్యవస్థ అభివృద్ధికి ఆటంకంగా మారే ఆ వ్యాధిని సమూలంగా తొలగించకపోయినప్పటికీ, వృద్ధిని నిలువరించవచ్చని గుర్తించాడు. అంతే, ఇంగ్లిష్ అర్థంకాక పోయినప్పటికీ.. ఆన్లైన్లో సమాచారాన్ని ట్రాన్స్‌లేటర్ సాయంతో అర్థం చేసుకొని కాపర్ హిస్టిడైన్తో ఔషధాన్ని తయారు చేశాడు.
తయారు చేసిన వయల్‌ను గ్జూవీయ్ తొలుత కుందేళ్లకు ఇవ్వగా, ప్రమాదమేమీ జరుగలేదు. అయితే, కొడుక్కి ఔషధాన్ని ఇస్తే ఏమవుతుందోనని భయపడిన ఆయన ముందుగా తానే ఆ డ్రగ్‌ను తీసుకున్నాడు. అయితే, ఎలాంటి దుష్పభ్రావాలు తలెత్తలేదు. దీంతో ధైర్యంచేసి పసివాడికి ఇచ్చాడు. రెండువారాల అనంతరం వచ్చిన రిపోర్ట్స్‌లో బాబు కోలుకున్నట్టు తేలింది. దీంతో గ్జూవీయ్ ఆనందానికి అవధుల్లేవు. కోలుకుంటున్న తన కొడుకు చిరునవ్వు చూశాక.. పడిన శ్రమంతా మరిచిపోయానని గ్జూవీయ్ చెబుతున్నారు. గ్జూవీయ్ పరిశోధనపై పలు ఫార్మా కంపెనీలు ఆసక్తి కనబరుస్తుండగా.. బిడ్డ కోసం తండ్రి తీసుకున్న నిర్ణయంపై యావత్ ప్రపంచం నివ్వెరపోయినప్పటికీ.. కొడుకు కోసం అతడు పడిన ఆరాటానికి ప్రశంసలు కురిపిస్తున్నది.