మామిళ్లగూడెం, ఏప్రిల్ 26 : అనుమానాస్పద స్థితిలో తండ్రి, పెద్ద కూతురు మృతిచెందిన ఘటన ఖమ్మం నగరంలో ఆదివారం రాత్రి వెలుగుచూసింది. స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేలకొండపల్లి మండలం బోదులబండకు చెందిన కనతాల రాము (32), రమ్య, పెద్దకుమార్తె దివ్య(5), చిన్న కుమార్తెతో కలిసి ఖమ్మం నగరంలోని మామిళ్లగూడెం సాయిబాబా ఆలయం సమీపంలో అద్దెకు ఉంటున్నారు. రాము ఓ ఆన్లైన్ పత్రికలో రిపోర్టర్‌గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. భార్యాభర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవని బంధువులు పేర్కొంటున్నారు. రెండురోజులుగా ఇంట్లో నుంచి కుటుంబ సభ్యులెవ్వరూ బయట కనిపించలేదు. ఆదివారం ఉదయం రమ్య, చిన్న కూతురు రితిక బయటకు వచ్చినట్టు స్థానికులు తెలిపారు.
సాయంత్రం వారు నివాసం ఉంటున్న ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతోపాటు మృతుడి బంధువులు వారి ఇంటిని పరిశీలించగా రాము, దివ్య విగత జీవులుగా రక్తపు మడుగులో పడిఉన్నారు. మృతదేహాలు కుళ్లే స్థితిలో ఉన్నాయి. వారికి సమీపంలోనే మృతుడి భార్య రమ్య అపస్మారకస్థితిలో ఉండగా, చిన్న కుమార్తె రితిక గాయాలతో పక్కనే బిక్క ముఖంతో ఉంది. గమనించిన స్థానికులు వెంటనే రెండో పట్టణ పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకుని రమ్య, రితికను ప్రభుత్వ దవాఖానకు తరలించారు. రాము, దివ్య మృతదేహాలను ఖమ్మం జిల్లా ప్రధాన దవాఖానకు తరలించారు. ఫోరెన్సిక్ బృందం నమూనాలను సేకరించారు. తండ్రీకూతురు ఇద్దరూ తీవ్రగాయాలతో మృతి చెందడంతోపాటు చిన్న కుమార్తెకు నుదిటిపై గాయంకావడంతో హత్యనా.. ఆత్మహత్యనా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఖమ్మం టూటౌన్ సీఐ బాలకృష్ణ తెలిపారు.