టాలీవుడ్లో ఇప్పుడో కొత్త చర్చ మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’ విడుదలైన క్రమంలో.. రివ్యూలపై కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీనిపై హీరో విజయ్ దేవరకొండ తన మనసులోని మాటను బయటపెట్టారు. గతంలో తన సినిమాలపై జరిగిన వ్యవస్థీకృత ఆన్లైన్ దాడుల గురించి ప్రస్తావిస్తూ.. ఇలాంటి పరిస్థితుల వల్ల తానెంతో మానసిక వేదనకు గురయ్యానని చెప్పుకొచ్చాడు. అందరూ కలిసి ఎదగాల్సిన చోట ఇలాంటి కుట్రలు ఎందుకు జరుగుతున్నాయని విజయ్ ప్రశ్నించాడు.అసలు కోర్టు ఆంక్షలు ఏంటి? సినిమాపై జరుగుతున్న కుట్రలేంటి?
సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు.. వందల మంది కష్టం, కోట్లాది రూపాయల పెట్టుబడి, వేలాది మంది కలల సమాహారం. కానీ, ఇటీవల కాలంలో ఒక సినిమా విడుదలైన వెంటనే కావాలని రేటింగ్‌లు తగ్గించడం, నెగెటివ్ క్యాంపెయిన్ చేయడం ఒక ట్రెండ్‌గా మారింది. ఒకప్పుడు సినిమా బాగుందో లేదో ‘మౌత్ టాక్’ ద్వారా తెలిసేది. కానీ ఇప్పుడు సినిమా బాగున్నా, లేకపోయినా.. రిలీజ్‌కు ముందే ‘డిజాస్టర్’ అని ముద్ర వేసే ఒక ‘రివ్యూ మాఫియా’ తయారైంది. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, బాట్ ఆర్మీలు, పెయిడ్ ప్రమోషన్ల దెబ్బకి సినిమా అల్లాడిపోతున్నది. ఈ ‘డిజిటల్ లిన్చింగ్’పై విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆయన నటించిన ‘డియర్ కామ్రేడ్’ సినిమా ఇలా నెగెటివ్ క్యాంపెయిన్‌కు గురైంది. అసలు ఈ రివ్యూల వెనుక ఉన్న చీకటి కోణాలేంటి?
ఎలా ఆడుకుంటారంటే..
సినిమాను చంపేయాలన్నా, బతికించాలన్నా ఈ మాఫియా దగ్గర కొన్ని పక్కా ప్లాన్లు ఉన్నాయి. సినిమా విడుదలకు ముందే పక్కా టెక్నాలజీ సోర్సులతో ఈ మాఫియా సిద్ధమైపోతుంది. ఫేక్ పోల్స్, రివ్యూ బాంబింగ్లతో బాక్సాఫీస్ వద్ద సినిమాల భవితవ్యాన్ని మార్చేస్తుంది!
డబ్బులిస్తే..: ప్రొడక్షన్ హౌస్‌లు, పీఆర్ ఏజెన్సీలు భారీగా డబ్బులు కుమ్మరించి జర్నలిస్టులు, ఇన్‌ఫ్లూయెన్సర్లతో ‘వండర్ ఫుల్’ అని రివ్యూలు రాపిస్తాయి. సోషల్ మీడియాలో బాట్లను వాడి సినిమా గురించి అద్భుతమైన ఫీడ్‌బ్యాక్ ఉన్నట్టు భ్రమింపజేస్తాయి.
నెగెటివ్ రివ్యూ బాంబింగ్: ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి. ప్రత్యర్థి ఫ్యాన్ గ్రూపులు లేదా ఇతర నిర్మాణ సంస్థలు పనిగట్టుకుని ఫేక్ అకౌంట్లతో ఒక సినిమాపై నెగెటివ్ కామెంట్స్ వర్షం కురిపిస్తాయి. సినిమా విడుదలైన మొదటి షోకే రేటింగ్ దారుణంగా పడిపోయేలా చేస్తారు వీళ్లు.
బాట్ల మాయాజాలం: వేల సంఖ్యలో ఆటోమేటెడ్ బాట్ అకౌంట్స్ క్రియేట్ చేసి.. రేటింగ్స్ శాతాన్ని ఎప్పటికప్పుడు మారుస్తుంటారు. ఇది ఎంత పక్కాగా జరుగుతుందంటే, సామాన్య ప్రేక్షకుడు దీన్ని ఫేక్ అని గుర్తుపట్టలేడు.
పెయిడ్ నెరేటివ్స్: యూట్యూబర్లు, ఎక్స్ ఇన్ఫ్లూయెన్సర్లకు డబ్బులు ఇచ్చి.. ఒక సినిమా గురించి కావాల్సిన రీతిలో ప్రచారం చేయిస్తారు. కొందరు కావాలనే లోపాలను అతిగా చూపిస్తూ నెగెటివ్ సెంటిమెంట్ పెంచుతుంటారు.
ఫేక్ పోల్స్: కొన్ని వెబ్సైట్లు కావాలనే పోల్స్‌ను మారుస్తుంటాయి. కేవలం తమకు నచ్చిన రివ్యూలను మాత్రమే హైలైట్ చేస్తూ.. ఒక సినిమా గురించి తప్పుడు అభిప్రాయాన్ని కలిగిస్తుంటాయి.
రేటింగ్స్ మాయాజాలం
మంచి సినిమాలను చంపేయాలన్నా.. చెత్త సినిమాలను ఆకాశానికి ఎత్తాలన్నా.. ఇప్పుడు రేటింగ్ మాఫియా ఒక రిమోట్ కంట్రోల్లా మారిపోయింది! అరచేతిలో ఉండే రేటింగ్స్ చూసి అది ‘హిట్’ లేదా ‘ఫ్లాప్’ అని ప్రేక్షకులు ఒక అంచనాకు వస్తున్నారు. కానీ, ఈ రేటింగ్స్ వెనుక జరుగుతున్న మాఫియా దెబ్బకు మంచి సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద చతికిలపడుతున్నాయి.
తప్పుదారి పట్టించడం: మెట్రో నగరాల్లో ఉండే సినిమా ప్రియులు దాదాపు అందరూ ఆన్లైన్ రేటింగ్స్‌పైనే ఆధారపడుతున్నారు. రేటింగ్ ఎక్కువగా ఉంటే అది గొప్ప సినిమా అని బలంగా నమ్ముతున్నారు. దీన్ని ఆసరాగా తీసుకుంటున్న మాఫియా.. పెయిడ్ రేటింగ్స్‌తో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి నిరుత్సాహానికి గురిచేస్తున్నది.
ప్రతిభకు చుక్కెదురు: ఎంతో కష్టపడి మంచి క్వాలిటీతో సినిమా తీసిన దర్శకులు, నిర్మాతలు ఈ ఫేక్ రేటింగ్స్ వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. పనిగట్టుకుని ఇచ్చే తక్కువ రేటింగ్స్ చూసి.. ప్రేక్షకులు థియేటర్లకు రావడం మానేస్తున్నారు. ఇది ప్రతిభ గల మేకర్ల ఉత్సాహాన్ని నీరుగారుస్తున్నది.
వసూళ్లపై దెబ్బ: ఈ రేటింగ్స్ థియేటర్లకు వచ్చే జనం సంఖ్యపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతున్నది. ఒక మంచి సినిమాకు రావాల్సిన వసూళ్లు.. నెగెటివ్ రేటింగ్ బాంబింగ్ వల్ల సగానికి సగం పడిపోతున్నాయి.
పైరసీ ముప్పు: రేటింగ్స్ రాలేదని తెలిస్తే.. థియేటర్లకు వెళ్లి డబ్బులు ఖర్చు చేయడం దండగ అని జనం భావిస్తున్నారు. అదే సమయంలో ఆ సినిమాను ఎలాగైనా చూడాలనే కుతూహలంతో అక్రమ వెబ్సైట్లలో పైరసీ ప్రింట్లవైపు మళ్లుతున్నారు. ఇలా రేటింగ్ మాఫియా పరోక్షంగా డిజిటల్ పైరసీకి ఊతమిస్తున్నది.
ఫేక్ రేటింగ్స్ కనిపెట్టండిలా!
రేటింగ్ స్టార్స్: ఏదైనా సినిమాకు అసాధారణంగా అంటే కేవలం 1 స్టార్ లేదా 10 స్టార్ రేటింగ్స్ మాత్రమే ఎక్కువగా కనిపిస్తున్నాయంటే.. అది పక్కాగా మేనేజ్ చేసిన రేటింగ్ అని అర్థం చేసుకోవాలి. అసలైన ప్రేక్షకులు ఇచ్చే రేటింగ్స్ ఎప్పుడూ మిశ్రమంగా ఉంటాయి.
రివ్యూ పదజాలం: ‘అద్భుతం’, ‘మైండ్ బ్లోయింగ్’, ‘తప్పక చూడండి’ వంటి రొటీన్ పదాలతో వందల రివ్యూలు కనిపిస్తున్నాయా? అయితే అవి బాట్లు రాసినవి అని ఫిక్స్ అయిపోండి. విశ్లేషణాత్మకంగా లేని ఏ రివ్యూ అయినా పెయిడ్ రివ్యూ అయ్యే అవకాశం ఉంది.
టైమ్ ట్రెండ్స్: సినిమా రిలీజ్ అయిన మొదటి గంటలోనే వేల సంఖ్యలో పాజిటివ్ లేదా నెగెటివ్ స్కోర్లు వచ్చి పడుతున్నాయంటే.. అది ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతున్న ఆన్లైన్ దాడి అని గుర్తించాలి.
అనిల్ రాచమల్ల
వ్యవస్థాపకులు
ఎండ్‌నౌ ఫౌండేషన్