నియంతల మెడలు వంచి
అధికార కుట్రల భగ్నం చేసి
ఆధిపత్య పోకడల ధిక్కరించి
రైతు సాధించిన చారిత్రక విజయం
దేశాన్ని గర్వంగా నిలబెట్టిన తరుణం!
సాగుబాటే కాదు పోరు బాట కూడా
తెలుసని నిరూపించిన సమయం!
దారిలో మేకులు దించినా
ఇనుప కంచెలు అడ్డేసినా
తుపాకీ తూటాలు పేల్చినా
ఢిల్లీ సరిహద్దులో ఏడాదిపాటు
అన్నదాత అలుపులేని పోరుకు
కేంద్రం తలవంచి మోకరిల్లింది
మూడు నల్ల చట్టాలను రద్దు పరిచింది!
ఎముకలు కొరికే చలిని
ముంచెత్తే జోరు వానను
నిప్పులు చిమ్మే ఎండను
తట్టుకొని ఉద్యమించాడు
కడకు గెలుపును ముద్దాడాడు!
నిజంగా ఇది
ఎర్రబారిన ఉద్యమం
సంఘటితశక్తుల శౌర్యం
ఎన్నడూ చూడని అద్భుతం
అన్నదాతల అపూర్వ విజయం!
రైతు యోధులారా..
మీ సంకల్ప దీక్ష అద్వితీయం
నిరసన నినాదం నిరుపమానం
సాహస సమరం స్ఫూర్తిదాయకం
జయహో శ్రామిక సేనా!
విజయహో కర్షక వీరా!!