యూరియా బస్తాలపై రవాణా చార్జీలు వసూలు చేయడంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం గానుగపాడు సొసైటీ అధికారులపై రైతులు మండిపడ్డారు. సొసైటీ సిబ్బంది ఒక్కో బస్తాకు రూ.35 చొప్పున వసూలు చేస్తుండటంపై అసహనం వ్యక్తంచేశారు.
యూరియా బస్తా ధర రూ.267 ఉండగా.. రవాణా, హమాలీ ఖర్చుల భారం కలిపి రూ.315 చొప్పున విక్రయిస్తుండటంపై సోమవారం సొసైటీ వద్ద అధికారులపై మండిపడ్డారు. వర్షా లు లేక ఇబ్బందుల్లో ఉన్న తమపై అదనపు భారం మోపడమేందని ప్రశ్నించారు.
నిర్మల్ జిల్లా కడెం మండలం ఉడుంపూర్ రైతులు అటవీ శాఖ అధికారుల తీరుపై సోమవారం నుంచి సహాయ నిరాకరణ ప్రారంభించారు. గిరిజన, గిరిజనేతర రైతులు సాగు చేసుకుంటున్న భూముల్లో ట్రాక్టర్ వాడకాన్ని నిషేధించాలని అధికారులు ఆంక్షలు విధించడం, గ్రామంలోని 17 మంది రైతులపై అక్రమ కేసులు పెట్టడంపై మండిపడ్డారు. ఈ క్రమంలో అటవీశాఖ అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి ఎలాంటి సహాయం అందించవద్దని గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ జొన్నల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, రైతులు, గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేసి, సాగులో సహకరిస్తేనే అండగా ఉంటామని పేర్కొన్నారు.