గద్వాల, సెప్టెంబర్ 21: పంటలెండి, కడుపు మండిన అన్నదాతలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తుంటే.. వారు ఓటేసి గెలిపించిన ఎమ్మెల్యే మాత్రం ఆనంద డోలికల్లో మునిగి తేలుతున్నారు. జూరాల నుంచి సాగునీరైనా ఇవ్వండి.. లేకుంటే విషమైన ఇవ్వండి.. అంటూ సోమవారం రైతులు భారీ నిరసన చేపట్టి అరిగోస పడుతుంటే, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అదేరోజు బర్త్‌డే సంబురాల్లో పాల్గొనడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. జిల్లా కేంద్రంలోనే ఎమ్మెల్యే ఉన్నా.. 6 గంటల పాటు అక్కడే రైతులు ధర్నా చేసినా వారి వద్దకొచ్చి సమస్యను తెలుసుకొనే సమయం ఆయనకు లేదా? అని ప్రశ్నిస్తున్నారు. ‘రైతుల వెంటే నేనుంటా.. గద్వాల అభివృద్ధి కోసమే పార్టీ మారా’ అని చెప్పుకొన్న ఎమ్మెల్యే మమ్మల్ని గాలికొదిలేశారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
రోడ్డుప ఎర్రటి ఎండలో నిరసన రాస్తారోకో చేస్తుంటే, అటువైపు ఎమ్మెల్యే కన్నెత్తి చూడటమే లేదని మండిపడుతున్నారు. పంటలు ఎండిపోయి తాము అవస్థలు పడుతుంటే, ఎమ్మెల్యే మాత్రం జన్మదిన వేడుకల్లో ఆనంద పడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తామంతా బతుకుదెరువుకు ఆరాట పడుతుంటే, ఎమ్మెల్యే ఎందుకు పట్టించుకోవడమే లేదని ప్రశ్నిస్తున్నారు. ఆనాడు రైతుల పంటపొలాలకు నీటిని విడుదల చేయాలని, లేనిపక్షం లో ఆందోళనకు సిద్ధమవుతున్నానని చెప్పిన ఎమ్మెల్యే తన ఉనికిని కాపాడుకొన్నారని, 2 నెలలు నీటిని విడుదల చేసిన తర్వాత పంట చేతికొచ్చే దశలో నీటిని నిలుపుదల చేసి రైతుల గొంతు కోశాడని రైతులు ధ్వజమెత్తుతున్నారు. జూరాల కాలువ నీటి విడుదల సమయంలో పూలు చల్లి ఆర్భాటం చేసి రైతుల చెవుల్లో పూలు పెట్టారని మండిపడుతున్న్నారు. నాడు కాలువలకు నీటిని విడుదల చేసే సమయంలో పంటలు ఎండకుండా నీరు అందిస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే.. ఇప్పుడు పంటలెండిపోతున్నా రైతుల గోస పట్టించుకోవడమే లేదని అంటున్నారు.