హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ధాన్యం కొనుగోళ్లపై యాగీ చేసిన రాష్ట్ర బీజేపీ నేతలు ఇప్పుడు పత్తాలేకుండా పోయారు. వరుసగా మీడియా సమావేశాలు, యాత్రలతో హడావిడి చేసిన బీజేపీ నేతలు ఎన్నికలు ముగిశాక గప్‌చుప్ అయ్యారు. రాష్ట్ర రైతుల ప్రయోజనాలే ఏకైక లక్ష్యంగా, ధాన్యం కొనుగోళ్లపై కేంద్రాన్ని ఒప్పించేందుకు రాష్ట్ర మంత్రుల బృందం ఢిల్లీలో విశ్వ ప్రయత్నాలు చేస్తుండగా, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ పత్తా లేకుండా పోయారు. మూడ్రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, అధికారుల బృందానికి కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్ అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా రాష్ట్ర బీజేపీ నేతలు స్పందించడం లేదు. తెలంగాణలోని రైతుల సమస్యను ఎందుకు పట్టించుకోవడం లేదని కేంద్రాన్ని ప్రశ్నించడం లేదు.
కేంద్రంలోని తమ పార్టీ పెద్దలను ఒప్పించేందుకు ప్రయత్నించకపోగా, కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు వత్తాసు పలుకుతున్నారని రైతులు చర్చించుకుంటున్నారు. యాసంగిలో వరి వేయండి.. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి ధాన్యం కొనుగోలు చేయిస్తానంటూ రైతులను రెచ్చగొట్టి, రాజకీయ చలిమంటలు కాచుకొనేందుకు ప్రయత్నించిన బండి సంజయ్ కేంద్రాన్ని ఒప్పించేందుకు ఏ చిన్న ప్రయత్నమూ చేయపోవడాన్ని రైతులు తప్పుపడుతున్నారు. ఎంత ధాన్యమైనా కొంటామని కేంద్రంతో లేఖ తీసుకొనిరావాలని సీఎం కేసీఆర్ విసిరిన సవాల్‌కు బండి సంజయ్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాధానం రాలేదు.
బీజేపీ ప్రభుత్వం గద్దె దిగిపోవాల్సిందే
రైతులను ఇబ్బంది పెడుతున్న బీజేపీ ప్రభుత్వానికి దేశాన్ని పరిపాలించే హక్కు లేదు. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రంపై కేంద్రం వివక్ష తగదు. రైతులను విస్మరించిన ఏ ప్రభుత్వమూ బతికి బట్టకట్ట లేదు. త్వరలో బీజేపీకి రైతులే తగిన బుద్ధిచెప్తారు.
-నర్సింగ్‌నాయక్, ఎర్కారం, సూర్యాపేట జిల్లా
రైతుల బొండిగ పిసికి సంపుతరా ఏంది?
కేసీఆర్ సార్ ఒచ్చినంకనే బోర్లల్ల నీళ్లు సూస్తున్నం. ఇప్పుడిప్పుడే ఎగుసాలు సాగుకొచ్చినయ్. మాకొచ్చిన పని వరి సాగు ఒక్కటే. వరి వద్దం టె సావాల్నా? బీజేపోళ్లు రైతుల బొండిగ పిసికి సంపుతరా ఏంది? కేసీఆర్ సారు రైతులను కడుపుల పెట్టుకుని సాదుకుంటుండు. ఢిల్లీల ఉంటె ఇక్కడ రైతుల కష్టాలు మీకేం తెలుస్త్తయ్. గ్రామాలకువచ్చి వడ్లు ఎందుకు కొనరో చెప్పండి. ఆదెరువు చూపండి. మేమంత కేసీఆర్ చెప్పినట్టు వింటం. రైతులు ఎగుసాలు మాని రోడ్లెక్కాల్నా?
-ధరావత్ భీమానాయక్, ఊరకుంట తండా, దేవరుప్పుల
తెలంగాణపై వివక్ష తగదు
తెలంగాణపై బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపడం సరికాదు. దీనిపై అన్ని ప్రతిపక్ష పార్టీలు ఉద్యమించాలి. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రతి కార్యక్రమంలోనూ పాల్గొంటాను. రైతులంతా చేయిచేయి కలిపి సీఎం కేసీఆర్ బాటలో నడవాల్సిన అవసరం ఉన్నది.
-బానోత్ ప్రమీల, మహిళా రైతు, బావోజీతండా, రఘునాథపాలెం మండలం, ఖమ్మం జిల్లా
రైతులను గింతగోస పెడ్తరా
ఓసారి వడ్లను కొంటమని, మల్లోసారి కొనమని బీజేపోళ్లు రైతులను గింత గోస పెడ్తరా. నాకు మా ఊర్లె సాయిబాబ గుడికాడ రెండెకరాల్నర భూమి ఉన్నది. ఆడనే బాయిగూడ ఉన్నది. ఐదేండ్లు కరువచ్చినప్పుడు సుక్కనీళ్లు గూడ లేకుండె. రెండేండ్ల సంది బాధలు తప్పినయ్. ఇగ మంచిగ బతుకుతమనుకున్నం. తెలంగాణల రైతులు మంచిగ బతుకుడు బీజేపోళ్లకు సూడబుద్దిగాలేదేమో ఇగ వడ్లు కొనుడు బంజేసిరి. ఇంతమంది రైతులు రోడ్లమీదికచ్చి ధర్నాలు జేసిన మనసు కరుగుతలేదాయె. యాసంగి వడ్లు కొంటమని సెప్పెదాక యాడికైన పోతం. కొట్లాడుతం.
-అల్లం దేవయ్య, రైతు, ఎల్లారెడ్డిపేట