Delhi Chalo | న్యూఢిల్లీ, డిసెంబర్ 2 : తమ డిమాండ్ల పరిష్కారానికి నోయిడా రైతులు మరోసారి ఉద్యమబాట పట్టారు. పార్లమెంటు సమావేశాల వేళ ‘ఢిల్లీ చలో’ కార్యక్రమాన్ని తలపెట్టారు. ప్రభుత్వం సేకరించిన తమ భూములకు పరిహారం పెంచాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ భారతీయ కిసాన్ పరిషత్(బీకేపీ), కిసాన్ మజ్దూర్ మోర్చా(కేఎంఎం), సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) వంటి రైతు సంఘాలు ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చాయి.
ఉత్తరప్రదేశ్‌లోని 20 జిల్లాల నుంచి తరలివచ్చిన రైతులతో సోమవారం ఉదయం నోయిడాలోని మహామయ ఫ్లైఓవర్ నుంచి ర్యాలీ ప్రారంభమైంది. ట్రాక్టర్లలో, పాదయాత్రగా పెద్ద సంఖ్యలో అన్నదాతలు ర్యాలీకి బయలుదేరారు. ఢిల్లీలోకి ప్రవేశించకుండా నోయిడాలోని దళిత్ ప్రేరణ స్థల్(అంబేద్కర్ పార్కు) వద్ద పోలీసులు, ఆర్ఏఎఫ్ బలగాలు.. రైతులను అడ్డుకున్నాయి. బ్యారీకెడ్లు దాటేందుకు రైతులు ప్రయత్నించడంతో స్వల్ప ఉద్రిక్తతలు తలెత్తాయి.
రైతులతో చర్చలు జరిపిన అధికారులు.. సమస్యల పరిష్కారానికి వారం పాటు సమయం కోరారు. వారంలో సమస్యలు పరిష్కరించకపోతే మళ్లీ ‘ఢిల్లీ చలో’ నిర్వహిస్తామని, అప్పటివరకు దళిత్ ప్రేరణ స్థల్‌లోనే ఉంటామని ఎస్కేఎం ప్రకటించింది. రైతుల ర్యాలీ, పోలీసులు భద్రతా చర్యల కారణంగా యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై గంటల తరబడి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది.