భోపాల్: పండించిన వెల్లుల్లికి కనీసం పెట్టుబడి ఖర్చు కూడా రాలేదని ఓ యువరైతు 160 కిలోల పంటకు నిప్పు పెట్టాడు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లోని దేవళి పట్టణానికి చెందిన శంకర్ తాను పండించిన వెల్లుల్లి పంటను మందసౌర్ మండీకి తీసుకొచ్చాడు. అక్కడ వ్యాపారులు వేలం వేశారు. కిలోకు 7 రూపాయలు మాత్రమే ఇస్తామన్నారు. దీంతో ఆవేదనతో రైతు వెల్లుల్లికి నిప్పు పెట్టాడు. ‘పంటను మార్కెట్కు తీసుకురావడానికే రూ.5 వేలు అయింది. మొత్తం పంటకు రూ.1,100 ఇస్తామన్నారు’ అని శంకర్ చెప్పాడు. తాను ఈ ఏడాది పంటలపై 2.5 లక్షలు ఖర్చు పెడితే లక్ష రూపాయలు మాత్రమే వచ్చాయని వాపోయాడు.