జహీరాబాద్, డిసెంబర్ 9: ఆ రైతులిద్దరు అన్నదమ్ములు.. మూడెకరాల వ్యవసాయ భూమి ఉన్నది.. ఆ భూమిలో వరి తప్ప అన్ని సీజనల్ పంటలు పండిస్తారు. సంప్రదాయంగా పండించే వరితో అంతగా లాభం రాదని, ఇతర పంటలతో లాభాలు వస్తాయని చెప్తున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రంజోల్కు చెందిన మరూఫ్ అలీ, ఫక్రుద్దీన్.
ప్రతి పంట 90 రోజుల్లోపు వచ్చేలా కూరగాయలు, ఆకుకూరలు సాగుచేస్తున్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు సాగుచేసి ప్రతి 90 రోజులకు ఎకరానికి ఖర్చులు పోనూ రూ.50 వేల వరకు ఆదాయం పొందుతున్నారు. పుదీనా, కొత్తిమీర, పాలకూర, టమాట, వంకాయ, గోరుచిక్కుడు, బీర్నీస్, చిక్కుడుకాయ, బెండ, పెద్ద చిక్కుడు, చామగడ్డ, ముల్లంగితో పాటు పలురకాల కూరగాయలు సాగుచేస్తున్నారు. అందుకు బిందు సేద్యాన్ని వాడుతూ నీటిని ఆదా చేస్తున్నారు. ‘ఎక్కడ మార్కెట్ ఉంటే అక్కడ అమ్ముతాం. ప్రతి పంటకు అంతర పంట వేస్తాం. ఒక పంటకు నష్టం వస్తే మరో పంటను పండించేలా ఏర్పాట్లు చేసుకొంటాం. వాతావరణంలో మార్పు వచ్చినా పెద్దగా నష్టం ఉండదు’ అని రైతు మరూఫ్ అలీ పేర్కొన్నాడు.