నమస్తే తెలంగాణ సెంట్రల్ డెస్క్: భారతదేశంలో అత్యద్భుత నిర్మాణాలు అంటే.. మొట్టమొదటగా చెప్పుకోవలసింది ఆలయాలే. ఏకశిలలు, గండశిలలను సైతం వెన్నముద్దలుగా మలచి.. ఎలాంటి సాంకేతికత అందుబాటులో లేని వేల ఏండ్లనాడే అద్భుతాలు సృష్టించిన శిల్పులు ఎందరో. ముఖ్యంగా దక్షిణాదిలో ఏ ఆలయాన్ని చూసినా.. తనివితీరదు. నాటి రాజులంతా.. ఒక సాంస్కృతిక కేంద్రాలుగా ఈ ఆలయాలను అభివృద్ధి చేశారు. వెయ్యేండ్లు దాటినా ఆ ఆలయాలు చెక్కుచెదరకుండా మనకు కనిపిస్తున్నాయి. ఇదంతా మనం చూడని.. మన కండ్ల ముందు జరుగని గత చరిత్ర.
ఈ ఆలయాన్ని ఫలానా రాజు నిర్మించాడని చదువుకోవడం, చూసి ఆనందించడం తప్ప.. ఆ నిర్మాణ అనుభూతి మనకు తెలియదు. మనతరంలో.. మన కండ్లముందు.. నాటి రాజరాజ చోళుడో.. కాకతి రుద్రదేవుడో.. శ్రీకృష్ణదేవరాయలో.. నాయకరాజులో.. పల్లవులో నిర్మించినట్టుగా.. నేడు తెలంగాణ ముఖ్యమంత్రి ఒక అద్భుతాన్ని సృష్టించారు. మరో వెయ్యేండ్లపాటు వర్ధిల్లేలా పంచనారసింహక్షేత్రమైన యాదాద్రిని పునరావిష్కరింపజేశారు. నేటి ప్రజాస్వామ్యయుగంలో ఏ పాలకుడూ చేయడానికి సాహసించని అపూర్వ ఆధ్యాత్మిక క్షేత్రంగా యాదాద్రిని జాతికి అందించారు.
లింగరాజ దేవాలయం
ఎప్పుడు: 11వ శతాబ్దం
ఎక్కడ: ఒడిశా
కట్టిందెవరు: సోమవంశి రాజులు
ఎన్నేండ్లవుతున్నది: వెయ్యేండ్లు దాటింది
ఒడిశాలోని అతి పెద్ద దేవాలయమిది. 1100 సంవత్సరాల క్రితం దీనిని నిర్మించారు. హరిహరుడు ప్రధాన దేవుడుగా పూజలందుకొంటున్న బ్రహ్మాండమైన గుడి ఇది. ఈ ఆలయాన్ని ఆరో శతాబ్దంలో నిర్మించారు. విశాలమైన ప్రహరీ.. అద్భుతమైన ప్రాకారం.. ఒడిశా సంప్రదాయ రీతిలో సమున్నతమైన గోపుర నిర్మాణం ఈ ఆలయానికి ఎంతో శోభను కల్పిస్తున్నది. పాశ్చాత్య చరిత్రకారుడు జేమ్స్ పెర్గుసన్.. ఈ ఆలయాన్ని సందర్శించి దీని వైభవాన్ని కీర్తించాడు.
విరూపాక్ష దేవాలయం
ఎప్పుడు: 7వ శతాబ్దం
ఎక్కడ: కర్ణాటకలోని హంపి
కట్టిందెవరు: చాళుక్యులు, విజయనగర రాజులు
ఎన్నేండ్లవుతున్నది: 1,400 ఏండ్లు దాటింది
దేశంలోని అత్యద్భుత నిర్మాణాల్లో ఒకటిగా భావించే విరూపాక్ష దేవాలయం కర్ణాటకలోని హంపిలో ఉన్నది. మహాశివుడు విరూపాక్షుడిగా ఇక్కడ దర్శనమిస్తాడు. ఈ ఆలయాన్ని 7వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించారు. ఆ తరువాత హోయసల రాజులు ఈ ఆలయాన్ని పోషించారు. విజయనగర రాజులు ఈ ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. శ్రీకృష్ణదేవరాయలు కూడా దీనికి మరింత సొబగులు దిద్దారు. ఇక్కడి సంగీత మండపంలో స్తంభాలు సప్తస్వరాలు పలుకుతాయి. రాజగోపురం పదకొండు అంతస్తులుగా నిర్మాణమైంది. ముఖమండపంపై అద్భుతమైన పెయింటింగ్స్ ఉన్నాయి. ఈ ఆలయంలో స్వామి ఉగ్రరూపుడు. అందువల్ల ముఖమండపం నుంచి గర్భాలయానికి దారి లేదు. అద్భుత నిర్మాణాల్లో ఇదొకటి.
చెన్నకేశవస్వామి ఆలయం
ఎప్పుడు: 10వ శతాబ్దం
ఎక్కడ: కర్ణాటకలోని హసన్ జిల్లా బేలూరు
కట్టిందెవరు: హోయసల రాజులు
ఎన్నేండ్లవుతున్నది: 1,100 ఏండ్లు దాటింది
కర్ణాటకలోని హసన్ జిల్లా బేలూరులోని చెన్నకేశవస్వామి దేవాలయం భారతీయ శిల్పకళకు పెట్టింది పేరు. హోయసల రాజులు ఈ దేవాలయాన్ని 10వ శతాబ్దంలో నిర్మించారు. చాళుక్యులపై విజయానికి చిహ్నంగా ఈ ఆలయాన్ని కట్టినట్టు తెలుస్తున్నది. ఈ ఆలయాన్ని సబ్బురాతి (Chloritic Schist)తో నిర్మించారు. ఇది తేలిక ఆకుపచ్చ రంగులో ఉంటుంది. సబ్బులాగా మెత్తగా ఉండటం వల్ల కావలసిన తీరుగా మలచడానికి అనువుగా ఉంటుందట. ఇక్కడి శిల్పాలు అతి సూక్ష్మంగా ఉండి అద్భుత సౌందర్యంతో అలరారుతాయి.
ఆది కుంభేశ్వర్ దేవాలయం
ఎప్పుడు: 9వ శతాబ్దంఎక్కడ: తమిళనాడులోని కుంభకోణం
కట్టిందెవరు: చోళరాజులు ఎన్నేండ్లవుతున్నది: 1,200 ఏండ్లు దాటింది
తమిళనాడులోని కుంభకోణంలో ఉన్న శివాలయం ఇది. ఇక్కడి శివుడిని లింగరూపంలో ఆది కుంభేశ్వరుడిగా కొలుస్తారు. ఈ ఆలయాన్ని 9వ శతాబ్దంలో చోళరాజులు నిర్మించారు. దాదాపు 30 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ ఆలయం నిర్మాణం జరిగింది. ఆలయానికి నాలుగువైపులా 4 గోపురాలు ఒక్కొక్కటి దాదాపు 128 అడుగుల ఎత్తున ఉంటాయి. ఈ ఆలయ సముదాయంలో చాలా మందిరాలున్నాయి.
ముఖ్యంగా శోడష స్తంభాల హాలు ఆకర్షణీయంగా ఉంటుంది.
వరదరాజ స్వామి ఆలయం
ఎప్పుడు: 11వ శతాబ్దం ఎక్కడ: తమిళనాడులోని కంచి
కట్టిందెవరు: కుళోత్తుంగ చోళుడు
ఎన్నేండ్లవుతున్నది: వెయ్యేండ్లు దాటింది
తమిళనాడులోని కంచిలో వరదరాజస్వామి దేవాలయాన్ని పదకొండో శతాబ్దంలో కుళోత్తుంగ చోళుడు నిర్మించాడు. తరువాత 14 వ శతాబ్దంలో దీన్ని విస్తరించారు. అనంతరం తంజావూరు నాయకరాజులు దీన్ని మరింత తీర్చిదిద్దారు. 23 ఎకరాల్లో విశిష్టంగా నిర్మించిన ఈ ఆలయంలో బంగారు బల్లి, వెండి బల్లి ఉంటాయి. వీటిని తాకితే.. బల్లి దోషాలు ఉండవని విశ్వాసం. ఇక్కడి శిల్పమండపంలో ఒక్కో స్తంభంపై వేలకొలది శిల్పాలు నిర్మించడం విశేషం. నాయకరాజుల తెలుగు శాసనం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది.
మదురై మీనాక్షి దేవాలయం
ఎప్పుడు: 1190-1205 సంవత్సరాల మధ్య
ఎక్కడ: తమిళనాడులోని మదురై
కట్టిందెవరు: రాజా కులశేఖర పాండ్య
ఎన్నేండ్లవుతున్నది: 800 ఏండ్లు దాటింది, (2,500 ఏండ్ల కిందటే కట్టినట్టు చారిత్రక ఆనవాళ్లు)
తమిళనాడులోని మదురైలో కొలువున్న మరో మహాద్భుతమైంది మీనాక్షీ దేవాలయం. 2500 ఏండ్ల క్రితమే ఈ ఆలయాన్ని నిర్మించారని చారిత్రక ఆనవాళ్లు చెప్తున్నాయి. చోళులు, పాండ్యు లు.. ఆ తరువాత విజయనగర రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. నాలుగువైపులా ఒకే విధంగా కనిపించే అద్భుతమైన నిర్మాణ వైచిత్రి కలిగిన దేవాలయం ఇది. 13, 14, 16 శతాబ్దాలలో ఈ ఆలయానికి నలువైపులా గోపురాల నిర్మాణం జరిగింది 16వ శతాబ్దంలో నాయకరాజైన విశ్వనాథ నాయకుడు మరలా ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఆసియాలోనే అతి అద్భుతమైన నిర్మాణశైలి కలిగిన ఆలయంగా ఇది ప్రసిద్ధి చెందింది.
సాగరతీర దేవాలయం (షోర్ టెంపుల్)
ఎప్పుడు: 700వ సంవత్సరం
ఎక్కడ: తమిళనాడులోని మహాబలిపురం
కట్టిందెవరు: పల్లవరాజు రెండో నరసింహ వర్మ
ఎన్నేండ్లవుతున్నది: 1,400 ఏండ్లు దాటింది
తమిళనాడులోని కంచి జిల్లాలో సముద్రతీరంలోని మహాబలిపురం (మామళ్లపురం)లో సాగర కెరటాలు తాకుతూ ఉండే ఆలయమిది. పల్లవ రాజైన రెండో నరసింహ వర్మ ఈ ఆలయాన్ని అద్భుతంగా నిర్మించాడు. ఇది శివుడి దేవాలయం. ఈ ఆలయాన్ని ప్రస్తుత శకం 700 సంవత్సరంలో నిర్మించారు. ఇక్కడి శిల్ప సంపద ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది.. పంచపాండవుల రథాలు.. ఏనుగులు.. ఇతర శిల్పాలు ఎంత చూసినా తనివితీరని సంపద.
కైలాస దేవాలయం
ఎప్పుడు: 8వ శతాబ్దం ఎక్కడ: మహారాష్ట్రలోని ఎల్లోరా గుహ
కట్టిందెవరు: రాష్ట్రకూటులకు చెందిన శ్రీకృష్ణ-1
ఎన్నేండ్లవుతున్నది: 1,300 ఏండ్లు దాటింది
మహారాష్ట్రలోని ఎల్లోరా గుహల్లో చరిత్రకు అందని రీతిలో నిర్మాణమైన దేవాలయం కైలాసదేవాలయం. ఎల్లోరా గుహల్లోని పదహారో గుహలో ఈ ఆలయం ఉన్నది. దీన్ని నిర్మించడానికి 150 సంవత్సరాలు పట్టిందని చెప్తారు. దాదాపు నాలుగు లక్షల టన్నుల రాయిని తొలిచి ఈ దేవాలయాన్ని నిర్మించారు. 8వ శతాబ్దంలో రాష్ట్రకూటులకు చెందిన శ్రీకృష్ణ-1 ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్తారు. దాదాపు 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ ఆలయంలో రామాయణ, భాగవత భారత గాథలను శిల్పాలుగా చెక్కారు.
సోమ్‌నాథ్ దేవాలయం
ఎప్పుడు: 11వ శతాబ్దం
ఎక్కడ: గుజరాత్‌లోని సౌరాష్ట్ర
కట్టిందెవరు: సోలంకి రాజు భీమ్దేవ్
ఎన్నేండ్లవుతున్నది: వెయ్యేండ్లు దాటింది
ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో మొట్టమొదటిదైన సోమ్‌నాథ్ దేవాలయం అపురూపమైంది. పశ్చిమాన అరేబియా సముద్రతీరంలో గుజరాత్‌లోని సౌరాష్ట్రలో ఈ ఆలయాన్ని నిర్మించారు. చారిత్రక ఆధారాల ద్వారా ఈ ఆలయాన్ని మొదట నిర్మించింది 1వ శతాబ్దంలో. ఇది శిథిలమైపోగా 649 వ సంవత్సరంలో దీన్ని పునర్నిర్మించారు. 11వ శతాబ్దంలో మహమ్మద్ ఘజ్నీ 17 సార్లు దండెత్తి ధ్వంసం చేయగా 11 శతాబ్ది చివరలో మరోసారి నిర్మించారు.
శ్రీరంగనాథ దేవాలయం
ఎప్పుడు: 7వ శతాబ్దం
ఎక్కడ: తమిళనాడులోని తిరుచిరాపల్లి
కట్టిందెవరు: చోళులు
ఎన్నేండ్లవుతున్నది: 1,400 ఏండ్లు దాటింది
108 శ్రీవైష్ణవ దివ్యదేశాలలో శ్రీరంగం మొదటిది. తమిళనాడులోని తిరుచిరాపల్లిలో కావేరీ నదీ తీరంలో 156 ఎకరాల విస్తీర్ణం.. 4116 మీటర్ల మేర విస్తరించిన అతి పెద్ద దేవాలయం. ఏడో శతాబ్దంలో చోళులు దీన్ని నిర్మించారు. ఆ తరువాత హోయసల రాజులు దీన్ని అభివృద్ధి చేశారు. దృఢమైన.. భారీ బురుజులతో కూడిన ఏడు అద్భుతమైన ప్రాకారాలు ఈ ఆలయానికి ఉన్నాయి. ఈ ప్రాకారాలలోని 21 బ్రహ్మాండమైన స్తంభాలు చూపరులను ఆకట్టుకుంటాయి.
రామప్ప దేవాలయం
ఎప్పుడు: 1,213వ సంవత్సరం
ఎక్కడ: తెలంగాణలోని ములుగు జిల్లా రామప్ప
కట్టిందెవరు: రేచర్ల రుద్రుడు
ఎన్నేండ్లవుతున్నది: 809 ఏండ్లు
తెలంగాణలోని ములుగు జిల్లాలో ఉన్న రామప్ప దేవాలయం 1213 లో కాకతీయ గణపతి దేవుడి కాలంలో రేచర్ల రుద్రుడు నిర్మించాడు. ఈ ఆలయంలో రామలింగేశ్వర స్వామి వారిని సూ ర్యకిరణాలు రోజూ అభిషేకిస్తాయి. గర్భాలయ తోరణ శిల్పాలు సంగీతాన్ని వినిపిస్తాయి. ఈ ఆలయం చుట్టూ ఏర్పాటుచేసిన మదనికల శిల్పాలు అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తాయి. నీటిపై తేలియాడే ఇటుకలతో గోపురాన్ని నిర్మించడం, ఇక్కడి శిల రంగు వెయ్యేండ్లు అయినా చెక్కు చెదరకుండా ఉండటం అపూర్వం. ఈ ఆలయానికి ప్రపంచ వారసత్వం సంపద గుర్తింపు కూడా లభించింది.
వెయ్యి స్తంభాల గుడి
ఎప్పుడు: 11వ శతాబ్దం
ఎక్కడ: తెలంగాణలోని వరంగల్
కట్టిందెవరు: కాకతి రుద్రదేవుడు
ఎన్నేండ్లవుతున్నది: వెయ్యేండ్లు దాటింది
తెలంగాణలోని వరంగల్‌లో 11వ శతాబ్దంలో కాకతి రుద్రదేవుడు నిర్మించిన త్రికూటాలయం వెయ్యిస్తంభాల గుడి. చాళుక్యుల శైలిలో నిర్మించిన ఈ దేవాలయం కాకతీయ రాజుల కళాపిపాసకు మచ్చుతునక. ఈ ఆలయంలో నారసింహ, సూర్యనారాయణ, రుద్రేశ్వర ఆలయాలున్నాయి. వీటిలో మొదటి రెండు శిథిలం కాగా.. ప్రస్తుతం రుద్రేశ్వరుడి ఆలయం లో శివుడు పూజలందుకొంటున్నాడు. నీటి పునాదులపై నిర్మించిన ఆలయంగా ఇది ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలోని ఏకశిలానంది అద్భుతంగా కనిపిస్తుంది. పైకప్పుపై ఉన్న శిల్పాలు.. నాట్యమండపంలోని శిల్పాలు అద్భుతంగా కనిపిస్తాయి.
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం
ఎప్పుడు: మార్చి 28, 2022 (పునర్నిర్మాణం పూర్తయిన రోజు)
ఎక్కడ: యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ
పునర్నిర్మాత: కే చంద్రశేఖర్‌రావు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి
స్వతంత్ర భారత చరిత్రలోనే ఒక ప్రభుత్వం సొంత ఖర్చులతో ఆలయాన్ని నిర్మించిన దాఖలాలు లేవు.. ఒక్క యాదాద్రి తప్ప. ఆ ఘనతంతా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుదే. అఖిలాండ కోటి బ్రహాండ నాయకుడికి వినమ్రపూర్వక నమస్కారం చేస్తూ, నియమ, నిష్టలతో ఆలయ పునర్నిర్మాణాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. వెయ్యేండ్లు అలరారేలా, నవ వైకుంఠమే అన్నట్టు మహోన్నతంగా నిర్మించారు. అందుకోసం ప్రత్యేకంగా యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసి, స్వయంగా సీఎం కేసీఆరే చైర్మన్‌గా వ్యవహరించారు. సమీప భూత భవిష్యత్ వర్తమానంలో ఎక్కడా నిర్మించలేని ఆలయాన్ని యాదాద్రిలో ఏడేండ్లలోనే అత్యద్భుతంగా, ఆహ్లాదభరితంగా, ఆధ్యాత్మిక ప్రతిరూపంగా తీర్చిదిద్దారు.