కేసీఆర్ పాలనలో పదేండ్లు.. ఎటుచూసినా పచ్చని మాగాణంలా తెలంగాణ కనిపించేది. నీళ్లు పారే సెలయేళ్లు, మత్తళ్లు దుంకే చెరువులు, చేను సెలకల చిరునవ్వుల ఆ పాలన మారిందో లేదో.. ప్రజాపాలన పేరుతో ఫ్యాక్షన్ రాజకీయాలు పురుడుబోసుకున్నాయి. పచ్చని తెలంగాణలో ప్రతిపక్ష నేతల నెత్తురు పారుతున్నది. అధికారపార్టీ నేతల దాడులతో బీఆర్ఎస్ కార్యకర్తల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. రక్త చరిత్రను తలపిస్తున్నాయి.
హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పట్టపగలే రాజకీయ ప్రత్యర్థుల హత్యలు జరుగుతున్నాయి. రాజకీయంగా అడ్డొస్తున్నాడని తెలిస్తే చాలు.. అధికారపార్టీ అండతో వేటాడి మరీ నరికేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారం చేపట్టిన వారాల వ్యవధిలోనే అతను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి పాలమూరు నుంచే మొదటి రాజకీయ హత్య నమోదైంది. కొన్నేండ్లపాటు దేశానికి జవాన్‌గా సేవ చేసి, బీఆర్ఎస్లో కీలక పాత్ర పోషిస్తున్న కొల్లాపూర్ నియోజకవర్గం పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లికి చెందిన మల్లేశ్ యాదవ్‌ను 2023 డిసెంబర్ 28న హత్య చేశారు. 2024 మే 23న అదే జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్‌రెడ్డిని గొడ్డళ్లతో అతి కిరాతకంగా నరికి చంపారు. 2024 జూన్ 2న ఖమ్మంలో భూతగాదాల సాకుతో రఘునాథపాలెం మండలం శివాయిగూడెనికి చెందిన ఈర్యనాయక్ అనే బీఆర్ఎస్ కార్యకర్తను దారుణంగా హత్య చేశారు.
ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. సీఎం సొంత జిల్లా నుంచే హత్యలు మొదలు పెడితే.. సూర్యాపేట జిల్లా నుంచి ఫ్యాక్షన్ దాడులకు తెరలేపారు. జాజిరెడ్డిగూడెం మండలం కోమటిపల్లి, కాసర్లపహాడ్‌కు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తల తలలు పగులగొట్టారు. కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం నాచుపల్లిలోనూ కావాలనే కాంగ్రెస్ నేతలు గొడవకు తెరలేపారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటరూరల్ మండలం దుబ్బతండాకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త కిరణ్‌పై అదే తండాకు చెందిన కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి మండలం గండివేట్‌లో కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు భీమ్‌దాస్.. హైమద్, రజాక్, జావేద్ అనే బీఆర్ఎస్ కార్యకర్తలపై కత్తితో దాడి చేశాడు.
తాజాగా సూర్యాపేట జిల్లా యర్కారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు మధు హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాష్ట్రంలో జరుగుతున్న హత్యారాజకీయాలకు ఆ మరణం మరొక సజీవ సాక్ష్యంగా నిలిచింది. 2018లో జరిగిన బీఆర్ఎస్ నాయకుడి హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్నాడనే నెపంతో.. కోర్టులో ఆ సాక్ష్యం లేకుండా చేసేందుకు అతి కిరాతకంగా మధును కాంగ్రెస్ నాయకులే హత్య చేశారు. రాజకీయ ప్రత్యర్థులు చంపేస్తారనే సమాచారం పోలీసులకు ఉన్నా అతన్ని కాపాడటంలో నిర్లక్ష్యం వహించారని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. ‘పోలీసు అధికారే స్వయంగా మధును పిలిచి.. త్వరలో నువ్ ఎగిరిపోతావ్ అని బెదిరించాడు’ అని జగదీశ్‌రెడ్డి చెప్పడమే కాంగ్రెస్ ఆగడాలకు పోలీసుల బలం ఎంత ఉందనేది స్పష్టమవుతున్నది. బీఆర్ఎస్పై ఎంత పగ ఉంటే.. ముక్కలు ముక్కలుగా నరికి చంపి, గోనె సంచిలో వేసి ఎస్సారెస్పీ కాలువలో పడేసి ఉంటారని రాష్ట్రమంతా చర్చించుకున్నారు.
హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్ ప్రాంతంలో వక్ఫ్‌బోర్డు భూముల ఆక్రమణలపై కొంతకాలంగా న్యాయపోరాటం చేస్తున్న అడ్వకేట్ ఖాజామొయిజుద్దీన్ను తెల్లవారుజామునే కారుతో గుద్ది కాంగ్రెస్ నాయకులే హత్య చేసినట్టు బాధిత కుటుంబం చెబుతున్నది. శనివారం ఉదయం నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పాతమాసబ్ట్యాంక్ పరిధిలో ఉదయం 5:45 గంటలకు మొయిజుద్దీన్ తన ఇంటి నుంచి బయటకు వచ్చి స్విమ్మింగ్‌కు వెళ్లేందుకు కారు ఎక్కుతుండగా నంబర్‌ప్లేట్ లేని కారుతో ఢీకొట్టించి మరీ చంపేశారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సంచలనంగా మారాయి. దీంతో న్యాయవాది హత్య కేసులో ప్రత్యేకంగా సిట్ వేయాలని డిమాండ్ సర్వత్రా వినిపిస్తున్నది. తమ ఆక్రమణలకు అడ్డొస్తున్నాడనే, అక్రమాలను నిలదీస్తున్నాడనే అక్కసుతోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు హత్య చేయించారని మృతుడి కుటుంబసభ్యులు చెబుతున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా ఫ్యాక్షన్ కల్చర్‌ను ప్రభుత్వమే ప్రోత్సహిస్తుందనడానికి ఇవి సాక్ష్యాలు.