అది 1876-78 మధ్య కాలం. వానకాలంలో సరైన వర్షాలు పడక పంటలు ఎండిపోయాయి. మండే ఎండలతో నదులు ఇంకిపోయాయి. తాగడానికి చుక్కనీరు దొరుకని దుస్థితి. పళ్లెంలో మెతుకు గగనమై పోయింది. మొత్తంగా ఏదో మహమ్మారి విరుచుకుపడ్డట్టు ప్రపంచ దేశాలు అతలాకుతలమైపోయాయి. కరువు రక్కసి దెబ్బకు తాళలేక ప్రజలు పిట్టల్లా రాలిపోయారు. ఆ ఉత్పాతంలో భారత్‌లో 96 లక్షల మంది, ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల మంది తిండిలేక మృత్యువాతపడ్డారు. ప్రజల ప్రాణాలు బలి తీసుకొన్న ఆ ప్రకృతి విలయాన్నే ‘సూపర్ ఎల్‌నినో’గా పరిశోధకులు పిలుస్తున్నారు. 150 ఏండ్ల తర్వాత ఇప్పుడు అలాంటి ‘సూపర్ ఎల్‌నినో’ త్వరలో మళ్లీ విరుచుకుపడే ప్రమాదం ఉన్నదని పలు వాతావరణ ఏజెన్సీలు తాజాగా హెచ్చరించడం సర్వత్రా ఆందోళన కలిగిస్తున్నది.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): ప్రపంచ దేశాలకు మరో పెనుముప్పు పొంచి ఉన్నది. అది సూపర్ ఎల్‌నినో రూపంలో పెను విపత్తు సృష్టించనున్నది. ఈ వైపరీత్యంతో కరువు కరాళ నృత్యం చేయనున్నది. జీవకోటి జీవన మనుగడ ప్రశ్నార్థకం కానున్నదని నిపుణుల హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలోని ఉపరితల జలాలు అత్యధికంగా వేడెక్కి ఈ సూపర్ ఎల్‌నినోను సృష్టిస్థాయని భావిస్తున్నారు. మే చివరి వారంలో ఎల్‌నినో మొదలై, జూలై చివరినాటికి అది సూపర్ ఎల్నినోగా రూపాంతరం చెందే అవకాశం 82 శాతం మేర ఉన్నదని ఎన్వోఏఏ (నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్) శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 2027 తొలి మాసం వరకూ ఈ సూపర్ ఎల్‌నినో కొనసాగే ప్రమాదం ఉన్నదని అంచనా వేస్తున్నారు. ఫలితంగా కొన్ని దేశాల్లో అతివృష్టి, భారత్ వంటి మరికొన్ని దేశాల్లో అనావృష్టి సంభవించవచ్చునని పరిశోధకులు చెప్తున్నారు. త్వరలో తాండవించనున్న ఈ సూపర్ ఎల్‌నినో 1876-78లో వచ్చిన దానికి సమానమైన తీవ్రత కలిగి ఉంటుందని, అప్పటి దుర్భర పరిస్థితులను పునరావృతం కావచ్చని పలు నివేదికలు హెచ్చరిస్తున్నాయి. మరో నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు పలుకరించనున్న వేళ.. ఈ సూపర్ ఎల్‌నినో హెచ్చరికలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా భారతదేశంలో వర్షపాతం తగ్గుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
సూపర్ ఎల్‌నినో గురించి తెలుసుకోవాలంటే ముందుగా ఎల్‌నినో గురించి తెలుసుకోవాలి. భూమధ్యరేఖ వెంబడి దక్షిణ అమెరికా ఖండం పశ్చిమతీరం వైపు పెరూ, ఈక్వెడార్ దేశాల సమీపంలో పసిఫిక్ మహా సముద్రజలాలు విస్తరించి ఉంటాయి. ఈ జలాలు అతిగా వేడెక్కితే, సముద్రగాలులు పశ్చిమానికి బదులు తూర్పునకు పయనిస్తాయి. దీంతో భారత్ వంటి ఆసియా దేశాల్లో వర్షపాతం తగ్గే అవకాశం ఉంటుంది. ఈ దృగ్విషయాన్నే ఎల్‌నినో అంటారు. సముద్రపు ఉష్ణోగ్రతలు 0.5 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరుగడం సాధారణంగా జరిగేదే. అయితే ఈ ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా పెరిగితే అది ‘సూపర్ ఎల్‌నినో’కు దారితీస్తుంది. ఫలితంగా భారత్ సహా పశ్చిమాసియా దేశాల్లో అనావృష్టి తాండవిస్తుంది.
కోపర్నికస్ ైక్లెమేట్ చేంజ్ సర్వీస్ తెలిపిన వివరాల ప్రకారం.. 2026 ఏప్రిల్‌లో పసిఫిక్ మహా సముద్రపు ఉపరితల జలాలను పరిశీలించగా, మరోమారు అత్యధిక స్థాయికి ఉష్ణోగ్రతలు చేరినట్టు వెల్లడైంది. ఇది గతంలోని బెంచ్ మార్క్ (0.5 డిగ్రీల సెల్సియస్) కన్నా 1.43 డిగ్రీల సెల్సియస్ మేర ఎక్కువగా నమోదైనట్టు తెలిసింది. ఈ ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతున్నట్టు, జూలై చివరినాటికి ఈ ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల సెల్సియస్‌కు చేరవచ్చని నేషనల్ ఎన్వోఏఏ పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. అంటే ఈ పరిణామం సూపర్ ఎల్‌నినోకు దారితీయొచ్చని వారు అంచనా వేస్తున్నారు. ఐఎండీ తాజా అంచనాల ప్రకారం ఈ ఏడాది వర్షపాతం దీర్ఘకాలిక సగటులో (ఎల్పీఏ) కేవలం 92 శాతమే ఉండొచ్చని తేలింది. అంటే వర్షపాతం సాధారణం కంటే తక్కువకే పరిమితం కానున్నట్టు తెలుస్తున్నది. ఈసారి జూలై కల్లా సూపర్ ఎల్‌నినో ఏర్పడితే భారత్‌లో వర్షపాతం మరింత తగ్గే ప్రమాదం ఉన్నదని వాతావరణ శాస్త్రవేత్త డాక్టర్ మాధవన్ నాయర్ తెలిపారు.

మునుపెన్నడూ చూడని విధంగా ఈ వేసవిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భూమిపైనే అత్యంత వేడి దేశంగా భారత్ రికార్డులకెక్కింది. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత వేడి నగరాల జాబితాలో ఉన్న 100 నగరాలు భారత్‌కు చెందినవే కావడం గమనార్హం. ఇలాంటి సమయంలో నైరుతి రుతుపవనాలు ఐదు రోజుల ముందుగానే కేరళను చేరుతాయన్న ఐఎండీ అంచనాలు రైతులకు కాస్త ఊరటనిచ్చాయి. సూపర్ ఎల్‌నినో ఏర్పడే పరిస్థితులు అంతకంతకూ పెరుగుతుండటం అన్నదాతలకు కొత్త భయాలను తీసుకొస్తున్నది. ఖరీఫ్ (వానకాలం)లోనే దేశంలో 65-70 శాతం వరకూ ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉన్నది. సూపర్ ఎల్‌నినో కారణంగా ఈసారి ఖరీఫ్‌లో సరైన వర్షాలు పడకపోవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఫలితంగా లక్షలాది మంది రైతులు గడ్డ్డు పరిస్థితులను ఎదుర్కోనున్నట్టు హెచ్చరిస్తున్నారు. సరైన వానలు లేక ధాన్యం దిగుబడి గణనీయంగా పడిపోయి దేశంలో ఆహార సంక్షోభం కూడా తలెత్తే ప్రమాదం ఉన్నదని మరికొందరు అంచనా వేస్తున్నారు. దిగుబడి రాకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఆదాయాన్ని కోల్పోయే ప్రమాదం ఉన్నదని చెప్తున్నారు. ఇప్పటికే యుద్ధాలతో పతనమైన ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై సూపర్ ఎల్‌నినో దెబ్బ మరింత గట్టిగా పడనున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం మే మూడోవారం వరకు ఉన్న అంచనాల ప్రకా రం.. సూపర్ ఎల్‌నినో కారణంగా పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలో తీవ్ర కరువు తలెత్తే ప్రమాదం ఉన్నది. ఢిల్లీ, తెలంగాణ, ఈశాన్య రాష్ర్టాల్లోనూ వానలు అంతంత మాత్రంగానే పడొచ్చని, సూపర్ ఎల్‌నినో ప్రభావం ఈ రాష్ర్టాలపైనా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. తమిళనాడు, ఏపీ వంటి తీర ప్రాంత రాష్ర్టాల్లో సూపర్ ఎల్‌నినో కారణంగా అధిక వర్షపాతం కురిసే అవకాశం ఉన్నట్టు నిపుణులు చెప్తున్నారు.
సూపర్ ఎల్‌నినో కారణంగా తెలంగాణలోనూ పరిస్థితులు దిగజారే ప్రమాదం ఉన్నదని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. నైరుతి వర్షపాతం 92 శాతం మేర ఉండొచ్చని ఐఎండీ అంచనా వేసినప్పటికీ, తెలంగాణలో అంతకన్నా 5 శాతం తక్కువ నమోదయ్యే అవకాశం ఉన్నట్టు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. తెలంగాణకు పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకలో ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని ఐఎండీ అంచనా వేస్తున్నది. అదే జరిగితే పశ్చిమ కనుమల్లో వర్షాలు పడకపోవడంతో గోదావరి, కృష్ణా నదుల్లో నీటిమట్టం తగ్గొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో వర్షాధార పంటలేవీ లేనప్పటికీ, నదీజలాలే సాగుకు ప్రధానం మార్గం. దీంతో ఎగువన వర్షాభావ పరిస్థితులు తలెత్తడంతో నదుల్లో నీటిమట్టం తగ్గి అది మన వ్యవసాయంపై ప్రతికూల ప్రభావాన్ని చూపొచ్చని, తాగునీటికి కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
1876-78 మధ్య పసిఫిక్ మహా సముద్ర జలాల ఉష్ణోగ్రతలు 3.5 డిగ్రీల సెల్సియస్‌ను దాటాయి. ఫలితంగా ఏర్పడిన సూపర్ ఎల్‌నినో కారణంగా ప్రపంచ దేశాల్లో కరువు విలయ తాండవం చేసింది. పంటలు పండకపోవడంతో తినడానికి తిండి లేక, తాగునీళ్లు అసలే లేక అప్పటి ప్రపంచ జనాభాలో 4 శాతం మంది (5 కోట్ల మంది) మృత్యువాతపడ్డారు. భారత్‌లో ఈ సంఖ్య 96 లక్షలపైనే. భారత్‌లో ముఖ్యంగా దక్షిణాదిన బాంబే, మైసూరు, మద్రాస్, హైదరాబాద్ ప్రావిన్స్‌లలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు తలెత్తి పంటలు పండలేదు. దీంతో లక్షలాది మంది రైతులు, నేత కార్మికులు కూలిపనుల కోసం ఉత్తరాదికి వలస వెళ్లారు. దక్షిణాదిలో జనాభా తగ్గడానికి ఈ కరువు కూడా ఒక కారణమైందని అంటారు. భారత్‌లో తలెత్తిన ఈ కరువును గ్రేట్ ఫెమైన్ (మహా కరువు) లేదా మద్రాస్ ఫెమైన్ (మద్రాస్ కరువు)గా పిలుస్తారు. ఈ కరువు కారణంగా చైనా, బ్రెజిల్, ఆఫ్రికా దేశాలపైనా తీవ్ర ప్రభావం పడింది. పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. ఇప్పటికీ ఆఫ్రికా దేశాలపై ఈ కరువు ప్రభావం ఉన్నదని నిపుణులు చెప్తారు.

1