న్యూఢిల్లీ, జూన్ 24 : ముడి చమురు ధరలు దాదాపు 5 శాతం పడిపోయి మంగళవారం 2 వారాల కనిష్ఠాన్ని తాకాయి. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణతో మిడిల్ ఈస్ట్‌లో చమురు సరఫరాకు నెలకొన్న అడ్డంకులు తొలగుతాయన్న అంచనాలే ఇందుకు కారణం. ఈ క్రమంలోనే బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ మార్కెట్లో బ్యారెల్ ధర 6 శాతం తగ్గి 66.65 డాలర్లుగా నమోదైంది.
అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ (డబ్ల్యూటీఐ)లోనూ బ్యారెల్ క్రూడాయిల్ రేటు 65.31 డాలర్లుగా ఉన్నది. ఈ నెల 10 తర్వాత ఈ స్థాయిలో ధరలు పలకడం ఇదే తొలిసారి. అయితే ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు కాల్పుల విరమణను ప్రకటించిన గంటల వ్యవధిలోనే దాన్ని ఉల్లంఘించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన మార్కెట్లో మళ్లీ ప్రకంపనల్ని సృష్టిస్తున్నది.