‘సోలో ట్రావెలింగ్’పై అతివలు ఆసక్తి చూపుతున్నారు. ప్రశాంతంగా గడిపిరావడానికి ప్రయాణాలను ఆశ్రయిస్తున్నారు. మానసిక ఒత్తిడి తగ్గేందుకూ.. ‘ట్రావెలింగ్’ను మించిన మందులేదని చెబుతున్నారు. అయితే, సరైన అవగాహన లేక.. ఒంటరి ప్రయాణికులు కొందరు ఇబ్బంది పడుతున్నారు. సోలో ట్రావెలింగ్ సేఫ్టీగా సాగాలంటే.. కింది సూచనలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
సోలో ట్రావెల్ చేద్దామనుకుంటే.. తక్కువ లగేజీతో మొదలుపెట్టండి. ఎందుకంటే, ఈ ప్రయాణమంతా మీ లగేజీని మీరే మోయాల్సి వస్తుంది. అందుకే, మీ వెంట ఎన్ని తక్కువ వస్తువులు ఉంటే.. అంతమంచిది. అంతేకాదు.. పొరపాటున మర్చిపోయినా.. దొంగతనానికి గురైనా మీరు ఎక్కువగా నష్టపోరు కూడా! సూట్‌కేసులకు బదులుగా.. బ్యాక్‌ప్యాక్‌ను తీసుకెళ్లండి.
బడ్జెట్, సేఫ్టీ సమస్య కాకుండా ఉండాలంటే.. హోటల్స్‌కు బదులుగా, హాస్టళ్లలో చెక్ ఇన్ అవ్వండి. ప్రభుత్వ గుర్తింపు పొందిన ట్రావెలింగ్ హాస్టళ్లలో తక్కువ ధరలోనే మంచి సేఫ్టీతో కూడిన హాస్పిటాలిటీ లభిస్తుంది. అంతేకాదు.. మీలాగే ఒంటరిగా ప్రయాణించే ఎంతోమంది మహిళలు అక్కడ తారసపడతారు. అలాంటివాళ్లతో కనెక్ట్ అవ్వండి. కలిసి ప్రయాణాలను కొనసాగించండి.
కొత్త ప్రదేశాలను సందర్శించినప్పుడు.. మొదటిరోజే మొత్తం తిరిగేయాలని అనుకోవద్దు. ఆయా ప్రదేశాల్లో సర్దుకోవడానికి మీ శరీరానికి కాస్త సమయం ఇవ్వండి. సిమ్లాను సందర్శించిన వెంటనే రాజస్థాన్‌లో వాలిపోయి.. అదేరోజు అక్కడి ఎడారుల్లో విహరిద్దామంటే కుదరదు. మంచుకొండలకు అలవాటైన మీ శరీరం.. ఎడారి ఎండలను తట్టుకోవాలంటే కనీసం ఒక్కరోజైనా పడుతుంది. అలాగే.. ప్రయాణాల వల్ల శరీరం కూడా అలసిపోతుంది. తగినంత విశ్రాంతి కోరుకుంటుంది. కాబట్టి, ఆయా వాతావరణాలకు అనుకూలంగా మారేదాకా.. మీ శరీరానికి విశ్రాంతి ఇవ్వండి.
మీ షెడ్యూల్లో కొద్దిగా ‘ఫ్రీస్పేస్’కూ చోటివ్వండి. కొందరు ప్రయాణానికి ముందే అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకుంటారు. ఏ రోజున ఎక్కడికి వెళ్లాలి, ఏ సమయంలో ఏం చేయాలో.. ముందే షెడ్యూల్ చేసుకుంటారు. అయితే, ప్రతిదాన్నీ ఇలా షెడ్యూలింగ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. మీరు సందర్శించిన ప్రాంతంలో అనుకోకుండానే కొన్ని ఆనందకరమైన క్షణాలు ఎదురవుతాయి. వాటిని కూడా మనసారా ఆస్వాదించండి. షెడ్యూల్లో లేదు కదా! అని అలాంటివాటిని పక్కన పెట్టేయకండి. చివరి నిమిషంలో తెలిసే ఈవెంట్లకూ ఓకే చెప్పండి. అందుకే, మీ షెడ్యూల్ మరీ బిజీగా ఉండకుండా చూసుకోండి. అప్పుడే.. ఊహించని సర్ప్రైజ్లకు ‘నో’ చెప్పాల్సిన అవసరం ఉండదు.
అన్నిటికన్నా ముఖ్యంగా.. మీకు సంబంధించిన అన్ని ధ్రువీకరణ పత్రాల ఫొటోకాపీలను మీ వెంటే ఉంచుకోండి. ‘సోలో ట్రావెలర్స్’కు చెందిన సోషల్ మీడియా గ్రూపులతో కనెక్ట్ అవుతూ ఉండండి. అక్కడినుంచి మీకు కావాల్సిన సలహాలు, సూచనలు తీసుకోండి. మీ అభిప్రాయాలు కూడా పంచుకోండి.