వినాయకనగర్, జూలై 2: నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తూ ఏసీబీకి చిక్కిన కే మల్లారెడ్డి అక్రమ సంపాదన మరింత వెలుగులోకి వచ్చింది. మల్లారెడ్డితోపాటు ఆయన బంధువుల ఇండ్లపై ఏసీబీ అధికారులు పది రోజుల క్రితం దాడులు చేసిన విషయం తెల్సిందే. 11 చోట్ల నిర్వహించిన సోదాల్లో రూ.కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుని, ఆయన్ను రిమాండ్‌కు తరలించారు. ఈ క్రమంలో మల్లారెడ్డిని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
తనిఖీల సమయంలో మల్లారెడ్డికి సంబంధించి హైదరాబాద్‌లోని పలు బ్యాంకుల్లో లాకర్లు ఉన్నట్టు గుర్తించారు. కోర్టు అనుమతితో బుధవారం రాత్రి వరకు రెండు లాకర్లను తెరువగా, రూ.1.82 కోట్ల విలువైన సొత్తు దొరికింది. ఒక లాకర్లో 1.25 కిలోల బంగారం, మరో దాంట్లో కిలో వెండి లభ్యమైంది. వాటిని సీజ్ చేసి కోర్టులో డిపాజిట్ చేసినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.