మేడ్చల్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): చెరువుల సమీపంలో ఉన్న లే అవుట్ల పరిశీలనకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని చెరువుల సమీపంలో ఉన్న లే అవుట్ల వివరాల సేకరణ చేస్తున్నట్లు సమాచారం. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే చెరువుల సమీపంలోని బఫర్ జోన్, ఎఫ్టీఎల్ హద్దుల గుర్తింపునకు సర్వేను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చెరువుల సమీపంలో అనుమతి ఇచ్చిన లే అవుట్లను పరిశీలించి బఫర్ జోన్ లేదా ఎఫ్టీఎల్లో ఉన్నాయా? అన్న దానిపై పరిశీలించనున్నారు. బఫర్ జోన్, లేదా ఎఫ్టీఎల్లో అనుమతులు ఇచ్చినట్లయితే ఎలాంటి చర్యలు ఉంటాయన్న దానిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆందోళనలు చెందుతున్నారు. అయితే, చెరువుల సమీపంలో ఉన్న లే అవుట్ల యజమానులకు నోటీసులు ఇచ్చి లే అవుట్లను పరిశీలించే అవకాశం ఉందని సమాచారం.
జిల్లాలో 97 చెరువుల బఫర్ జోన్, ఎఫ్టీఎల్ హద్దుల గుర్తింపు..
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 97 చెరువులు ఉండగా, ఇప్పటి వరకు 97 చెరువుల బఫర్ జోన్, ఎఫ్టీఎల్ హద్దుల గుర్తింపును పూర్తి చేశారు. మరో 110 చెరువుల బఫర్ జోన్, ఎఫ్టీఎల్ హద్దుల గుర్తింపునకు సర్వేను కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే 413 చెరువుల సర్వేను మూడు నెలల్లో పూర్తి చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా చెరువుల బఫర్ జోన్, ఎఫ్టీఎల్ హద్దుల గుర్తింపు, అనంతరం, ఆక్రమణలకు గురి కాకుండా ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. చెరువుల సమీపంలో ఉన్న లే అవుట్ల పరిశీలనకు ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు బృందాలుగా ఏర్పడి 97 చెరువుల సమీపంలో పరిశీలన జరపనున్నట్లు విశ్వసనీయ సమాచారం.