హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): మాజీ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీపీహెచ్) గడల శ్రీనివాసరావు వైద్యారోగ్య శాఖలో తన ప్రస్థానానికి ముగింపు పలికారు. ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ దరఖాస్తును (బీఆర్ఎస్) ప్రభుత్వం ఆమోదించింది. 6 నెలల తర్వాత ఆయన బీఆర్ఎస్ను ఆమోదిస్తూ ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. మరో ఏడేండ్ల సర్వీస్ ఉండగానే గడల స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ప్రజారోగ్య విభాగంలో జాయింట్ డైరెక్టర్ క్యాడర్లో ఉన్న ఆయనను గత నెల 27న మహబూబాబాద్ అడిషినల్ డిస్ట్రిక్ట్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్‌గా బదిలీ చేసింది. కానీ ఆయన విధుల్లో చేరలేదు. గడల శ్రీనివాసరావు 2018 మే నుంచి 2023 డిసెంబర్ 20వరకు సుదీర్ఘకాలం డీపీహెచ్గా కొనసాగారు.
కరోనా సమయంలో ఫుల్ క్రేజ్
గడల శ్రీనివాసరావు నేషనల్ హెల్త్ మిషన్‌లో పని చేస్తున్నప్పుడే మాజీ సీఎం కేసీఆర్ ఆయన సమర్థతను గుర్తించారు. సీనియర్లను కాదని 2018 మే 28న డీపీహెచ్గా నియమించారు. స్వేచ్ఛగా పనిచేసుకునే అవకాశం ఇచ్చారు. విపత్తుల సమయంలో గడల సమర్థంగా పనిచేశారు. 2019లో డెంగ్యూ విజృంభించగా.. తక్కువ సమయంలోనే అదుపులోకి తీసుకురాగలిగారు. ఇక కరోనా విపత్తు సమయంలో గడల శ్రీనివాసరావు పేరు మార్మోగిపోయింది. నాటి ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కొవిడ్ నియంత్రణ, చికిత్స, వ్యాక్సినేషన్‌ను సమర్థంగా నిర్వహించారు. గడలకు బీఆర్ఎస్ ముద్ర ఉండటంతో కాంగ్రెస్ ఆయనను పక్కనబెట్టింది. దీంతో ఆయన వీఆర్ఎస్ తీసుకున్నారు.