Sukumar | అల్లు అర్జున్, సుకుమార్ ఈ కాంబినేషన్ ఓ సన్సేషన్. ఆర్యతో మొదలైన ఈ జోడి ఆ తరువాత ఆర్య-2, పుష్ప, పుష్ప-2 చిత్రాలతో కొనసాగుతుంది. తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్లో పుష్ప-2 ది రూల్ త్వరలోనే రాబోతుంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో వున్న ఈ చిత్రం డిసెంబరు 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తొలిసారిగా ఈ ఇద్దరి కలయిక కలిసింది మాత్రం ఆర్య చిత్రంతోనే.. అప్పటి వరకు వున్న మూస ప్రేమకథల ఫార్ములాను బ్రేక్ చేసి ఆర్య ప్రేమకథా చిత్రాల్లో సరికొత్త సన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఆర్య చిత్రం షూటింగ్‌కు ముందు జరిగిన పలు ఆసక్తికర అనుభవాలను సుకుమార్ ఇటీవల ఓ సమావేశంలో షేర్ చేసుకున్నారు.
దిల్ సినిమాకు పనిచేస్తున్నప్పుడే వైజాగ్‌లో చిత్రీకరణ జరుగుతున్నప్పుడు నేను రాసిర కథలో కొన్ని సన్నివేశాలు, మాంటేజ్ షాట్ దిల్‌రాజుకు చెబుతుండేవాడ్ని. అవి ఆయనకు బాగా నచ్చి దిల్ సినిమా హిట్టయితే నీకు దర్శకత్వం చాన్స్ ఇస్తా అనేవాడు. ఇక దిల్ పెద్ద విజయం సాధించడంతో ఆ మాట గుర్తుపెట్టుకుని నన్ను పిలిపించాడు. అయితే నన్ను ఆయన ఓ రీమేక్ సినిమా చెయ్యమని అడిగితే చేయనని నిర్మోహమాటంగా చెప్పేశాను. సరే నీ కథ చెప్పమని అనడంతో చాలా ఆసక్తిగా కథ విన్నాడు. కొంత సమయం ఆలోచించుకుని ఓకే చెప్పాడు. ఇక అప్పట్నుంచీ హీరో వేటలో వున్నాను. అయితే నా మనసులో మాత్రం కొత్తవారితో చేద్దామని వుండేది.
ఒకసారి నేను అందరూ వున్నప్పుడు అల్లు అర్జున్ పేరు చెప్పగానే అందరూ నవ్వేశారు. ఆ సమయంలోనే దిల్ ప్రివ్యూ వేస్తే అల్లు అర్జున్ వచ్చాడు. మేమందరం బయట వుండి మాట్లాడుకుంటుంటే వచ్చాడు బన్నీ. రాగానే అందర్ని ఎంతో హుషారుగా పలకరిస్తూ హడావుడి చేస్తున్నాడు. అందరికి షేక్ హ్యాండ్ ఇస్తూ కౌగిలించుకుంటున్నాడు. నాకు బన్నీలో ఆ క్షణంలోనే ఆర్య కనిపించాడు. అప్పటి వరకు నా నిర్ణయాన్ని వ్యతిరేకించిన నా స్నేహితులు కూడా నాతో పాటు బన్నీకి ఓటేశారు. మన ఆర్యకు కరెక్ట్‌గా సరిపోతాడు అన్నారు.ఆ తరువాత మూడునెలలు అడిషన్ చేసి మరి ఆర్య చిత్రీకరణ మొదలుపెట్టాం అంటూ చెప్పుకొచ్చారు సుకుమార్.