సిటీబ్యూరో, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): ఆరోగ్యకరమైన శిశు జననంతోపాటు పుట్టిన ప్రతి బిడ్డ ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఎదగడం సమాజానికి ఎంతో అవసరమని నగర అదనపు పోలీసు కమిషనర్ శిఖాగోయల్ అన్నారు. ఆరోగ్యకరమైన శిశువులు ఉంటేనే సమాజం కూడా ఆరోగ్యకరంగా ఉంటుందని వివరించారు. సోమాజిగూడ యశోద దవాఖానలో నూతనంగా ఏర్పాటు చేసిన మదర్ అండ్ చైల్డ్ కేర్ సెంటర్‌ను సోమవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా శిఖాగోయల్ మాట్లాడుతూ.. మాతా శిశు సంరక్షణలో భాగంగా స్త్రీ వ్యాధులు, సంతాన సాఫల్యం, చిన్నపిల్లలకు సంబంధించి యశోద హాస్పిటల్ ప్రత్యేకంగా మదర్ అండ్ చైల్డ్ సెంటర్‌ను ప్రారంభించడం అభినందనీయమన్నారు. యశోద హాస్పిటల్స్ డాక్టర్ పవన్ గోరుకంటి మాట్లాడుతూ.. భవిష్యత్‌లో ఉండాల్సిన మాతా- శిశువుల దవాఖానకు సంబంధించిన ప్రమాణాలు, ప్రపంచ స్థాయి వైద్య సదుపాయాలతో యశోద మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్‌ను రూపొందించడం జరిగిందన్నారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సోమాజిగూడ యశోద హాస్పిటల్లో కార్డియాలజి, నెఫ్రాలజి, పల్మనాలజి, ఎండ్రోక్రనాలజి తదితర 72 ప్రధాన విభాగాలతో పాటు నిష్ణాతులైన వైద్య సిబ్బంది ఈ మదర్ అండ్ చైల్డ్ ఇనిస్టిట్యూట్‌లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిడియాట్రిషియన్ డాక్టర్ సురేశ్ కుమార్ పానుగంటితో పాటు వైద్య నిపుణులు, సిబ్బంది పాల్గొన్నారు.

ది ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా ఆధ్వర్యంలో ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్లో వ్యవస్థాపక దినోత్సవం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి, ప్రొఫెసర్ డాక్టర్ కె.జయశంకర్, బి.బ్రహ్మారెడ్డి, జి.వెంకట సుబ్బయ్య, డాక్టర్ కె. సీతారాంబాబు, కె.సుబ్బిరెడ్డి, ఎం.శ్యామ్ ప్రసాద్ రెడ్డి, బి.రమణానాయక్ బానోతు పాల్గొన్నారు.