హైదరాబాద్ : బరువు.. బాధ్యతలల్లో తలమునకలై చదువుకోవాలన్న ఆశ ఉన్నా.. దాన్ని నెరవేర్చుకోలేకపోతున్న వారికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం శుభవార్త చెప్పింది. ఇలాంటి వారి కోసం సాయంకాలం కోర్సులను ప్రవేశపెట్టాలని యూనివర్సిటీ నిర్ణయించింది. టూరిజం అండ్ కల్చర్, పేయింటింగ్స్, జానపదకళలు, సంగీతం, రంగస్థల కళలు, ఇంద్రజాలం వంటి కోర్సులను ప్రవేశపెట్టనున్నది.
ఇప్పటికే యూనివర్సిటీలో జ్యోతిషం సహా పలు కోర్సులను సాయంకాల కోర్సుగా నిర్వహిస్తుండగా.. తాజాగా మరికొన్ని కోర్సులను ప్రవేశపెట్టాలని యూనివర్సిటీ స్టాడింగ్ కౌన్సిల్లో నిర్ణయానికి వచ్చారు. గతంలో ఇంటర్, డిగ్రీ సహా మరికొన్ని కోర్సుల్లో సాయంకాల కోర్సులకు మంచి డిమాండ్ ఉండేది. వీటిల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపించేవారు. కాలక్రమేణా రెగ్యులర్ కోర్సుల రాకతో ఇవి కనుమరుగయ్యాయి. తాజాగా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ విరివిగా సాయంకాల కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నది.
తెలంగాణ భాషా సంస్కృతిని మరింత ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు యూనివర్సిటీలో సమ్మర్ కోర్సులను సైతం ప్రవేశపెట్టనున్నారు. వీటికి సైతం స్టాడింగ్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే యూనివర్సిటీలో పలు పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులను నిర్వహిస్తున్నారు. ఇవి రెండు సంవత్సరాల నుంచి 6 మాసాల కాల వ్యవధి కలిగినవి కావడంతో వీటిల్లో విద్యార్థులు చేరేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదు. వీటిల్లో చేరాలంటే రెగ్యులర్ చదువులను వదులుకోవాల్సి ఉండడంతో ఈ కోర్సులకు డిమాండ్ ఉండడం లేదు. ఈ నేపథ్యంలో 45 రోజుల వ్యవధి గల డిప్లొమా, షార్ట్ టర్మ్ సమ్మర్ కోర్సులను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. బుర్రకథ, హరికథ, లైట్ మ్యూజిక్, థియేటర్, పేరిణి, మ్యాజిక్ వంటి కోర్సులను ఇందులో చేర్చాలని భావిస్తున్నది. డిగ్రీ, ఇంజినీరింగ్ విద్యార్థులు వేసవి సెలవుల్లో ఈ సమ్మర్ కోర్సుల్లో చేరే అవకాశం లభించనుంది.