గొంతులో గాంభీర్యం.. మాటలో చమత్కారం.. చూపులో తీక్షణత.. విమర్శల్లో వెటకారం.. తోటివారితో పరిహాసం.. ఆటగాళ్లతో సోదరభావం..
ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో! అదేనండి.. భారత జట్టుకు సుదీర్ఘకాలం కోచ్‌గా వ్యవహరించి పొట్టి ప్రపంచకప్‌తో బాధ్యతల నుంచి వైదొలిగిన అలనాటి ఆల్‌రౌండర్.. మేటి కామెంటేటర్ రవిశాస్త్రి గురించే!! ఐసీసీ టోర్నీ గెలువలేదనే ఒక్క బాధ తప్పిస్తే.. ఆటగాళ్లందరికీ దూకుడును ఉగ్గుపాలతో పట్టించి.. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా మనకు తిరుగులేదనే స్థాయికి చేర్చిన మేటి మాంత్రికుడు! విదేశీ బౌలర్లకు మన పేస్ దళం ఏమాత్రం తీసిపోదని నిరూపించిన ఇంద్రజాలికుడు!! కరోనా వంటి కష్టకాలంలోనూ జట్టుతో పాటే కలిసి నడిచిన ‘రవిభాయ్’ కోచింగ్‌కు ఫుల్స్టాప్ పెట్టేసి రాహుల్ ద్రవిడ్‌కు బాధ్యతలు అప్పగించేశాడు!
గణాంకాల పరంగా చూసుకుంటే.. ప్రధాన కోచ్ రవిశాస్త్రి హయాంలో భారత జట్టు ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలువలేకపోయినా.. ప్రపంచ క్రికెట్లో బలమైన శక్తిగా ఎదిగిందనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు! ఆస్ట్రేలియాను వారి గడ్డపైనే ఓడించి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చేజిక్కించుకోవడం.. రెండేండ్ల తర్వాత బలహీన జట్టుతోనే దాన్ని నిలబెట్టుకోవడం.. ఇంగ్లండ్ గడ్డపై ఒకే సిరీస్‌లో రెండు టెస్టులు నెగ్గడం.. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల్లో టీ20 సిరీస్‌లు గెలువడం ఇలా లెక్కకు మిక్కిలి విజయాలు నమోదు చేసుకుంది. ముఖ్యంగా ప్రత్యర్థి ఎవరైనా భయం లేకుండా బరిలోకి దిగి సత్తాచాటాలనే తన దృక్పథాన్ని రవిశాస్త్రి.. ఆటగాళ్లలో బలంగా తీసుకెళ్లగలిగాడు. పక్కా వ్యూహాలు, పదునైన మాటలతో ఉత్తేజం నింపగల శాస్త్రి తన సుదీర్ఘ సేవలు ముగించుకొని భారత జట్టు నుంచి దూరమవుతున్న సమయంలో అతడి ఘనతలు గుర్తు చేసుకుంటే..
ఇక విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నా. మానసికంగా నీరసించి పోయా. కరోనా వైరస్ కారణంగా ఆరు నెలలుగా బయో బబుల్‌కే పరిమితమవడం నాతో పాటు ఆటగాళ్లను కూడా తీవ్రంగా ఇబ్బందిపెట్టింది. ఐపీఎల్‌కు టీ20 ప్రపంచకప్‌నకు మధ్య ఇంకాస్త ఎక్కువ గడువు ఉండాల్సింది. పెద్ద టోర్నీలకు ముందు ఒత్తిడి ఉండటం సహజం. అయితే పరాజయాలకు కుంగిపోవడం లేదు. ఓటములకు భయపడం. రానున్న రోజుల్లో రాహుల్ ద్రవిడ్ జట్టుకు మార్గదర్శకుడిలా వ్యవహరించనున్నాడు. ఆ పదవికి అతడే సరైనవాడు. విరాట్ ఎప్పటికీ నాయకుడే. టెస్టు క్రికెట్‌కు అతడు ప్రధాన ప్రతినిధి.
– రవిశాస్త్రి