వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)లో తాజాగా తీసుకొచ్చిన సంస్కరణలతో పేద, మధ్యతరగతి ప్రజలకు గొప్ప ప్రయోజనాలు చేకూరుతాయంటూ మోదీ ప్రభుత్వం ఊదరగొడుతున్నదంతా ఉత్తదేనని తేలిపోయింది. జీఎస్టీ 2.0తో సామాన్యులకు ఒరిగేదేమీ లేదని నిపుణులు చెప్తున్నారు. శ్లాబుల కుదింపు ఏమోగానీ.. నిత్యావసరాలు మొదలుకొని, పిల్లల పుస్తకాలు, పెన్నులు, డెలివరీ సర్వీసులు, చివరకు దివ్యాంగుల సహాయ పరికరాలపైనా గతంతో పోలిస్తే, పన్ను శాతం మరింతగా పెరిగిందని అభిప్రాయపడుతున్నారు.
(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): వస్తు-సేవల పన్ను (జీఎస్టీ)లో తాజాగా తీసుకొచ్చిన సంస్కరణలతో పేద, మధ్యతరగతి ప్రజలకు గొప్ప ప్రయోజనాలు చేకూరాయని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించుకొన్నది. జీఎస్టీలోని గత నాలుగు శ్లాబులను రెండుకి తగ్గించడాన్ని చారిత్రాత్మక నిర్ణయంగా అభివర్ణించింది. జీఎస్టీ 2.0ను తదుపరి తరం సంస్కరణగా, దీన్నో ‘బచత్ ఉత్సవ్’గా (పొదుపు ఉత్సవంగా) ప్రధాని మోదీ సహా కమలదళం నేతలందరూ ప్రచారం చేస్తున్నారు. అయితే, కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ 2.0 ఫలాలు సంపన్నులకు మోదంగా, సామాన్యులకు ఖేదంగా మిగిలాయని నిపుణులు చెప్తున్నారు. శ్లాబుల కుదింపు ఏమోగానీ.. నిత్యావసరాలు, ఆరోగ్య బీమా, పిల్లల పుస్తకాలు, చేనేత వస్ర్తాలు, ఆన్లైన్ డెలివరీ సేవలు ఇలా ఒక్కటేమిటి చివరకు దివ్యాంగులు వాడే సహాయ పరికరాలపై కూడా గతంతో పోలిస్తే, పన్ను శాతం మరింతగా పెరిగిందని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు.. గత నెల 22 నుంచే జీఎస్టీ తగ్గిన రేట్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ, చాలా ప్రాంతాల్లో పాత ధరలనే కొనసాగిస్తున్నారని వేలాదిగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
నేతన్న నడ్డి విరుస్తూ..
దేశంలో వ్యవసాయం తర్వాత లక్షలాది మందికి జీవనాధారంగా ఉన్న చేనేత (హ్యాండ్లూమ్), దుస్తుల (టెక్స్టైల్) రంగంపై మోదీ ప్రభుత్వం ట్యాక్స్ వేటు వేసింది. రూ. 2,500 కంటే ఎక్కువ ఖరీదు చేసే చేనేత, ఇతరత్రా వస్ర్తాలపై ప్రస్తుతం ఉన్న 12 శాతం జీఎస్టీని ఏకంగా 18 శాతానికి పెంచింది. ఈ నిర్ణయంతో చేనేత, టెక్స్టైల్ రంగంపై ఆధారపడే కార్మికులపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశమున్నదని పారిశ్రామికరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేంద్రప్రభుత్వ నిర్ణయంపై చేనేత కార్మికులతో పాటు టెక్స్టైల్ ఇండస్ట్రీ ప్రతినిధులు మండిపడుతున్నారు. తాజా నిర్ణయం వినియోగదారులపై అదనపు భారాన్ని మోపుతుందని హెచ్చరిస్తున్నారు. మెషీన్లను వాడకుండా చేతులతో నేసే ఈ చీరలు ఎంతో మన్నికైనవని, లేబర్ కష్టం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. ఇంతటి శ్రమ ఉన్న కంచి, బెనారస్, పోచంపల్లి, ధర్మవరం, వెంకటగిరి, గద్వాల్ వంటి చీరలు రూ. 2,500కు ఎలా వస్తాయని? ప్రశ్నిస్తున్నారు.
బీమాకు ధీమా కరువాయె
ఆరోగ్య, జీవిత బీమా పాలసీలపై జీఎస్టీని ఎత్తేసినట్టు ప్రచారం చేసుకొన్న కేంద్రం.. గ్రూప్ బీమా పాలసీలపై మాత్రం ట్యాక్సును 18 శాతంగానే కొనసాగించడం ఆందోళన కలుగజేస్తున్నది. అంతేకాదు, వ్యక్తిగత బీమా పాలసీదారులకు కూడా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) రూపంలో మరో భారం పడుతున్నట్టు పలువురు విశ్లేషకులు చెప్తున్నారు. వివరంగా చెప్పాలంటే.. దేశంలో బీమా పాలసీలు రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి వ్యక్తిగత బీమా పాలసీ కాగా, రెండోది గ్రూప్ బీమా పాలసీ. వ్యక్తిగత బీమా పాలసీలను అసంఘటిత రంగ కార్మికులు, వ్యాపారులు తీసుకొంటుండగా, గ్రూప్ బీమా పాలసీలు ఉద్యోగుల తరఫున కంపెనీలు తీసుకొంటాయి.
ఆ మేరకు ఉద్యోగుల వేతనం నుంచి కొంత మొత్తాన్ని ప్రీమియం రూపంలో వసూలు చేసి ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లిస్తాయి. గ్రూప్ బీమా పాలసీలపై 18 శాతం జీఎస్టీని కేంద్రం యథాతథంగానే కొనసాగించింది. దీంతో జీఎస్టీ 2.0తో తమపై ప్రీమియం భారం ఏ మాత్రం తగ్గలేదని ఉద్యోగులు వాపోతున్నారు. ఇక, వ్యక్తిగత బీమా పాలసీలపై జీఎస్టీ ఎత్తివేసినట్టు కేంద్రం ప్రకటించినప్పటికీ, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) పేరిట పాలసీదారులకు కొంతమేర భారం పడుతున్నట్టు ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. జీఎస్టీ ఎత్తివేతతో ఐటీసీ క్లెయిములకు ఆస్కారమే లేకుండా పోతున్నదని, దీంతో తమ వ్యాపార కార్యకలాపాలకు చేసే చెల్లింపుల భారం ఇకపై కంపెనీలపైనే పడబోతున్నట్టు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఈ భారాన్ని పాలసీదారులపైనే కంపెనీలు వేసే ప్రమాదం ఉన్నదని చెప్తున్నారు. ఇదే జరిగితే పాలసీల బేస్ ప్రీమియం ధరలు 3 నుంచి 5% పెరగవచ్చని అంటున్నారు.
పిల్లల చదువునూ వదల్లేదు
జీఎస్టీ తాజా సవరణలతో పిల్లల స్కూల్ ఫీజుల భారం, టెక్ట్స్‌బుక్స్, పెన్నులు, బ్యాగుల రేట్లు అమాంతం పెరిగాయని ఆర్థిక విశ్లేషకులు చెప్తున్నారు. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోసం తీసుకొనే కోచింగ్, ఆన్లైన్ క్లాసులు, ట్యూషన్ ఫీజుల్లో కూడా ఏ మాత్రం ఊరట దక్కలేదని వివరిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. స్కూల్, కాలేజీల ఫీజులపై ఎలాంటి జీఎస్టీ భారం ఉండదని పైకి చెప్తున్న కేంద్రప్రభుత్వం.. పాఠశాల నిర్వహణ ఖర్చులపై మాత్రం ట్యాక్సుల మోత మోగించింది. సప్లిమెంటరీ ఎడ్యుకేషన్ కిందకు వచ్చే స్కూల్లో వినియోగించే ఐటీ సేవలు, క్లీనింగ్, సెక్యూరిటీ, మెయింటెనెన్స్, డెవలప్మెంట్ తదితరాలపై గతంలో 12 శాతంగా ఉన్న జీఎస్టీని ఇప్పుడు 18 శాతానికి పెంచింది. ప్రస్తుతం ట్యూషన్ ఫీజుతో పాటు సెక్యూరిటీ, స్కూల్ డెవలప్మెంట్, టెక్, ల్యాబ్ సర్వీసులు ఇలా అన్నింటినీ కలిపి స్కూల్ ఫీజుగా యాజమాన్యాలు వసూలు చేస్తున్నాయి.
తాజాగా సప్లిమెంటరీ ఎడ్యుకేషన్‌పై కేంద్రం జీఎస్టీని పెంచడంతో పిల్లల స్కూల్ ఫీజులు మరింతగా పెరిగే ప్రమాదం ఉన్నదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ యాజమాన్యాలు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)ని క్రెడిట్ చేసుకోలేవు కాబట్టి, ఈ పెరిగిన ఖర్చులు ఫీజుల రూపంలో విద్యార్థుల తల్లిదండ్రులకు అదనపు భారాన్ని మిగల్చడం ఖాయమని విద్యావేత్తలు చెప్తున్నారు. నోట్‌బుక్స్‌పై జీఎస్టీని ఎత్తేసిన కేంద్రం.. టెక్ట్స్‌బుక్స్, ప్రింటెడ్ స్టడీ మెటీరియల్‌పై మాత్రం 12 శాతంగా ఉన్న జీఎస్టీని 18 శాతానికి పెంచింది. దీంతో స్కూల్ పిల్లల టెక్ట్స్‌బుక్స్, కోచింగ్‌కు ప్రిపేరయ్యే విద్యార్థుల స్టడీ మెటీరియల్ ధరలకు రెక్కలు వచ్చాయి. పెన్నులు, బ్యాగులపై కూడా 18 శాతం జీఎస్టీని విధించింది. కేంద్రం నిర్ణయంతో దేశవ్యాప్తంగా 20 కోట్ల మంది విద్యార్థులపై, వారి కుటుంబ సభ్యులపై ఆర్థిక భారాన్ని మోపుతుందని విశ్లేషకులు చెప్తున్నారు.
కార్మికులకు కష్టం
జీఎస్టీ సవరణలు కార్మికులకు శరాఘాతంగా మారాయి. లేబర్ చార్జీలపై ప్రస్తుతం ఉన్న 12 శాతం జీఎస్టీని 18 శాతానికి పెంచడంతో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) గడ్డు పరిస్థితులు దాపురించాయి. కొత్త పన్ను విధానంతో తాము కంపెనీలను మూసేసుకోవాల్సిందేనని ఎంఎస్ఎంఈ ప్రతినిధులు చెప్తున్నారు. లేబర్ చార్జీలపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని పలుమార్లు విజ్ఞప్తి చేశామని, అయితే, తగ్గించాల్సింది పోయి కేంద్రం మరింతగా పెంచిందని మండిపడుతున్నారు.
డెలి‘వర్రీ’
స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, మ్యాజిక్ పిన్ వంటి ఫుడ్, కిరాణా సర్వీసులను అందించే ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంలు అందించే డెలివరీ సర్వీసులపై కేంద్రం తాజాగా 18 శాతం జీఎస్టీ విధించింది. దీంతో పెరిగిన డెలివరీ చార్జీలను కస్టమర్ల నుంచి ఆయా సంస్థలు వసూలు చేయనున్నాయి. అంటే, కేంద్రం తాజా నిర్ణయం అంతిమంగా వినియోగదారులపైనే భారాన్ని మోపిందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. స్విగ్గీ, జోమాటో తదితర ఫుడ్ డెలివరీ యాప్స్.. కస్టమర్లు ఆర్డర్ చేసిన ఆహారానికి సంబంధించి బేస్ ప్రైస్‌తో పాటు ప్లాట్‌ఫాం ఫీజు, రెస్టారెంట్ చార్జీలు, డెలివరీ ఫీజు, ప్యాకేజింగ్ చార్జీలు, క్యాన్సలేషన్ ఫీజు, రెయిన్ ఫీజు, ట్రాఫిక్ ఫీజు పేరిట ఏవేవో పేర్లు చెప్తూ వినియోగదారుడి నుంచి ఇబ్బడిముబ్బడిగా చార్జీలను వసూలు చేసేవి. అయినప్పటికీ, డెలివరీ చార్జీలపై ఇప్పటివరకూ జీఎస్టీ లేకపోవడంతో కస్టమర్లకు కొంత మొత్తంలో ఊరట దక్కేది. అయితే, కేంద్రం తీసుకొన్న తాజా నిర్ణయంతో.. డెలివరీ చార్జీలపై 18 శాతం జీఎస్టీ పడింది. అంటే, డెలివరీ యాప్స్ వసూలు చేసే డెలివరీ ఫీజుకు ఈ పన్ను అదనంగా చేరింది. అంటే, హోమ్ డెలివరీ సేవలు మరింత ఖరీదుగా మారాయి.
బ్యూటీ’ఫుల్ బాదుడు
సౌందర్య సంరక్షణ, ఫిజికల్ వెల్నెస్ సర్వీసులకు సంబంధించి ఇప్పటివరకూ ఉన్న 18 శాతం వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను 5 శాతానికి తగ్గిస్తూ తామేదో గొప్ప పని చేశామని కేంద్రంలోని మోదీ సర్కారు ప్రచారం చేసుకొంటున్నది. అయితే తాజా నిర్ణయంతో సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, జిమ్ సెంటర్లు, యోగా క్లాసులకు వెళ్లే వేలాది మందికి దక్కే ప్రయోజనం అంతంతేనని తెలుస్తున్నది. బ్యూటీ, వెల్నెస్ సర్వీసులపై జీఎస్టీని 5 శాతానికి తగ్గించినప్పటికీ, కస్టమర్లకు ఆ స్థాయిలో ప్రయోజనం చేకూరబోదని పారిశ్రామిక నిపుణులు చెప్తున్నారు. అంతేకాదు, ఇప్పుడు ఉన్న బిల్లు పెరుగవచ్చని కూడా హెచ్చరిస్తున్నారు. బ్యూటీ, వెల్నెస్ సేవలను అందించే సర్వీస్ ప్రొవైడర్లకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) ప్రయోజనాలు అందకపోవడమే దీనికి కారణమని విశ్లేషిస్తున్నారు.
జీఎస్టీ లో మార్పులు.. ఇప్పుడే ఎందుకు?
మోదీ ప్రభుత్వ దౌత్య వైఫల్యం కారణంగా భారతీయ ఎగుమతులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారీ సుంకాలు విధించారు. దీంతో స్వదేశీ కంపెనీల నుంచి వస్తు-ఉత్పత్తుల ఎగుమతులు నిలిచిపోయే పరిస్థితి దాపురించింది. కొనుగోళ్లు నిలిచిపోతే, ద్రవ్యవినిమయం జరుగదు. దీంతో ఎంతోకాలంగా విమర్శలను ఎదుర్కొంటున్న జీఎస్టీ పన్నులను తప్పనిసరి పరిస్థితుల్లో కేంద్రం సవరించాలని నిర్ణయించింది. తద్వారా దేశీయ కొనుగోళ్లు పెంచాలనుకొన్నది. అలాగే, ప్రజాక్షేత్రంలో అధికార బీజేపీ గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతున్నది. బీహార్ సహా పలు రాష్ర్టాల్లో త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. ఇవన్నీ బేరీజు వేసుకొన్న తర్వాతే జీఎస్టీ శ్లాబుల్లో మార్పులూ చేర్పులకు కేంద్రం సిద్ధమైనట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ, జీఎస్టీ 2.0 నిర్ణయాలు సామాన్యుడి ఆర్థిక స్థితిపై ప్రతికూల ప్రభావాన్నే చూపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దివ్యాంగులపైనా దయ లేదాయే..
దేశంలో దివ్యాంగులకు ఉపయోగపడే వీల్ చైర్లు, బ్రెయిలీ పుస్తకాలు, వినికిడి పరికరాలు, కృత్రిమ అవయవాలు, క్లచెస్, స్పెషల్ సాఫ్ట్వేర్ వంటి సహాయ పరికరాలపై జీఎస్టీ మోత మోగింది. ఇవన్నీ దివ్యాంగుల రోజువారీ జీవనానికి అవసరమైనవి. ఇవి ఐశ్వర్యానికి గానీ , విలాస జీవితానికి గానీ సంబంధించినవి కావు. బతికే హక్కు కోసం అవసరమయ్యే వస్తువులు. కానీ జీఎస్టీ పేరుతో వీటిపై 5 నుంచి 18 శాతం వరకు పన్ను వేసి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు.
చాలా చోట్ల పాతరేట్లే
కొత్త జీఎస్టీ ప్రకారం.. చక్కెర, కొబ్బరి, కాఫీ, నమ్కీన్, భుజియా, తొక్కులు (ఊరగాయలు), టూత్ పౌడర్, బేకింగ్ పౌడర్, చాక్లెట్లు, బిస్కెట్లు, బాదం, పిస్తా, కర్జూరం, కొవ్వొత్తులు, అంజీర్, వెన్న, నెయ్యి, చీజ్ తదితరాలు 12 శాతం నుంచి 5 శాతం పన్ను పరిధిలోకి దిగి వచ్చాయి. వీటితోపాటు సబ్బులు, టూత్పెస్ట్లు, టూత్ బ్రష్‌లు, హెయిర్ ఆయిల్, షాంపూ, టాల్కం, ఫెస్ పౌడర్, షేవింగ్ క్రిమ్, లోషన్లు కూడా 18 నుంచి 5 శాతం పన్ను పరిధిలోకి వచ్చాయి. గత నెల 22 నుంచే కొత్త ధరలు అందుబాటులోకి రావాల్సి ఉండగా.. ఇంకా చాలా చోట్ల అలా జరుగలేదు. పాత రేట్లను కొనసాగిస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా వేలాదిమంది ఫిర్యాదులు చేశారు. అయితే, సమస్యను పరిష్కరించాల్సిన కేంద్రం.. నివేదికల పేరిట కాలయాపన చేస్తున్నది. మొత్తంగా చిన్నమొత్తాల్లో వీటిని కొనుగోలు చేసే పేద, మధ్యతరగతి ప్రజలే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నది. ఇదేసమయంలో అణగారిన వర్గాలు కొనలేని ప్రీమియం కార్లు, హై ఎండ్ ఫ్రిడ్జ్‌లపై ఇప్పటికే రేట్లను తగ్గించారు. అయితే, ఈ ప్రయోజనాలు సంపన్నులకే దక్కుతుండటం గమనార్హం.