హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 12 (నమస్తే తెలంగాణ): ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) రంగంలో నూతన ఆవిష్కరణలకు అవసరమైన పరిజ్ఞానాన్ని అందించేందుకు టీహబ్ ఆధ్వర్యంలో ఈవీ ఎంటర్‌ప్రెన్యూర్స్ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహన రంగంలో వస్తున్న నూతన అవకాశాలను అందిపుచ్చుకొనేలా ఔత్సాహికులను శిక్షణ ఇవ్వనున్నారు. ఇప్పటికే ఈ రంగంలో ఉన్న నిపుణులు, మార్గదర్శకులతో సమావేశాలు నిర్వహించి, ఈవీ రంగంలో ఉన్న అవకాశాలను, సవాళ్లను ప్రత్యక్షంగా తెలుసుకునే ఏర్పాటు చేయనున్నారు. ఈవీ ఎంటర్‌ప్రెన్యూర్స్ ప్రోగ్రామ్‌లో శిక్షణ పొందినవారు సొంత వ్యాపార సంస్థలను, స్టార్టప్‌లను ప్రారంభించేందుకు అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు టీహబ్ కృషి చేస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు https://bit.ly/3rSeaYc లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.