న్యూఢిల్లీ: ప్రస్తుతం పసిఫిక్ మహా సముద్రంలో వస్తున్న ఒక పెద్ద మార్పు ప్రపంచవ్యాప్తంగా వాతావరణ శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించింది. ‘యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్'(ఈసీఎండబ్ల్యూఎఫ్) తాజా నివేదిక ప్రకారం ఉష్ణ మండల పసిఫిక్ మహా సముద్రం అధికారికంగా ఎల్ నినో ప్రారంభాన్ని సూచించే కీలకమైన ఉష్ణోగ్రత పరిమితిని దాటింది. ఈ వేడెక్కే ధోరణులను ధ్రువీకరించే హై రిజల్యూషన్ డేటాను అందించడంలో ‘యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ’ కీలక పాత్ర పోషించింది. భారతదేశంలో రుతు పవనాల కాలంలో ఎల్ నినో ప్రారంభం కావడం అనేది అత్యంత అరుదుగా సంభవించే పరిణామం. ఇది దేశంలో వర్షపాతం తగ్గడానికి, మన వ్యవసాయ రంగంలో గణనీయమైన సవాళ్లు ఏర్పడేందుకు దారి తీస్తుంది. రుతు పవనాలు జూన్ 4న కేరళ తీరాన్ని తాకాయి.
ఇది సాధారణం కన్నా మూడు రోజులు ఆలస్యంగా జరిగింది. సీనియర్ వాతావరణశాస్త్రవేత్త ఎం రాజీవన్ తదితరులు ఎల్ నినోతో ముడిపడివున్న వాతావరణ మార్పులు ఇప్పటికే వ్యక్తమవుతున్నాయని తెలిపారు. అయితే దీనిని అధికారికంగా ప్రకటించాలంటే ఈ పరిస్థితులు మూడు నెలల పాటు కొనసాగాల్సి ఉంటుంది. భారత వాతావరణ శాఖ ఈ సంవత్సరం సాధారణం కంటే తక్కువ వర్షపాతాన్ని ఇప్పటికే అంచనా వేసింది. ఆశించిన వర్షపాతం దీర్ఘకాలిక సగటులో 90 శాతంగా ఉంటుందని తెలిపింది. సీజన్ నడుస్తున్న కొద్దీ పసిఫిక్ వేడెక్కడం, ఇతర వాతావరణ చోదకాలతో ఎలా సంరక్షణ చెందుతుందో శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. వారు ఎల్ నినో పరిస్థితుల కారణంగా తలెత్తే వైవిధ్యాలకు అనుగుణంగా దేశం సిద్ధం అయ్యేందుకు తగిన సమాచారాన్ని అందిస్తారు.