దేవరుప్పుల, జూలై 3 : అమెరికాలోని చికాగో నగరంలో శుక్రవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు జన్మదిన వేడుకలను అతని కుటుంబ సన్నిహితుడు దాసరి నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఆటా మహాసభల కోసం ఎర్రబెల్లి అమెరికాకు వెళ్లగా.. ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వందలాది మంది ప్రవాస భారతీయులు ఎర్రబెల్లి 70వ జన్మదిన వేడుకలకు తరలిరావడంతో సందడి వాతావరణం నెలకొన్నది. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. తనపై అభిమానంతో పార్టీలకతీతంగా తరలివచ్చి ప్రేమాభిమానాలు చూపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
తన 70వ జన్మదిన వేడుకలు మరపురాని అనుభూతిని మిగిల్చాయని సంతోషం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో అమెరికా తెలుగు సంఘం వ్యవస్థాపకుడు హన్మంతరావు, ఎన్నారై బీఆర్ఎస్ నాయకులు ఎర్రంరెడ్డి తిరుపతిరెడ్డి, ఆటా పూర్వ అధ్యక్షుడు కరుణాకర్ మాధవరం, ప్యాకేజింగ్ కార్పొరేషన్ ఆఫ్ అమెరికా సీఈవో కృష్ణకుమార్, పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన ప్రముఖ ఎన్నారై కేతిరెడ్డి విష్ణురెడ్డి, ఇన్నోవా సొల్యూషన్ డైరెక్టర్ నషీర్, ప్రముఖ పారిశ్రామిక వేత్త అజయ్ సుంకర, ప్రముఖ సినీ నిర్మాత అనిల్ సుంకర తదితరులు పాల్గొన్నారు.