ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన బ్రిటిష్ సామ్రాజ్యానికి అతి చిన్న 13 వలస కాలనీల సముదాయం 1776లోనే సవాల్ విసిరింది. 171 ఏండ్ల తర్వాత 1947లో మరో దేశం అదే సామ్రాజ్యానికి వీడ్కోలు పలికింది. మొదటిది అట్లాంటిక్ మహాసముద్రం అవతల ఉన్న అమెరికా అయితే, దానికి వేల మైళ్ల దూరంలో హిందూ మహాసముద్రం ఒడ్డున సువిశాలంగా విస్తరించి ఉన్న భారత ఉపఖండం రెండవది. నాయకులు వేరు, పోరాట పద్ధతులు వేరు, కాలం వేరు. కానీ ఈ రెండు దేశాలు పోరాడింది ఒక్క శత్రువుతోనే-రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంతో.
2026 జూలై 4తో అమెరికా స్వాతంత్య్ర ప్రకటనకు 250 ఏండ్లు పూర్తవుతున్నాయి. ఆ సందర్భంగా ఆ దేశ స్వాతంత్య్ర పోరాటాన్ని అవలోకనం చేసుకుంటే, భారత స్వాతంత్య్రోద్యమంలోని అనేక దృశ్యాలు మన కండ్ల ముందు కదలాడుతాయి. ఒకదానికొకటి ప్రతిరూపాలు కాకపోయినా, సారూప్యాలు మాత్రం అనేకం. అమెరికా స్వాతంత్య్రానికి దాదాపు ఒకటిన్నర శతాబ్దం ముందు, 1607లో ఇంగ్లండ్‌కు చెందిన ‘లండన్ కంపెనీ’ నేటి అమెరికా తూర్పుతీరంలోని వర్జీనియాలో, జేమ్స్ నది ఒడ్డున ఉన్న జేమ్స్టౌన్ పట్టణంలో తొలి శాశ్వత ఆంగ్ల కాలనీని స్థాపించింది. ఆ తర్వాత ఆంగ్లేయులు వనరులు సమృద్ధిగా ఉన్న అట్లాంటిక్ తీరప్రాంతాల్లో అంచెలంచెలుగా స్థిరపడుతూ వచ్చారు. ఆ విధంగా 1732 నాటికి మొత్తం 13 బ్రిటిష్ కాలనీలు ఆ ప్రాంతంలో పురుడు పోసుకున్నాయి. ఈ ఉదంతం..భారతదేశ పశ్చిమతీరంలోని సూరత్‌లో తొలుత వ్యాపారకేంద్రాన్ని ఏర్పాటు చేసి, అంచెలంచెలుగా తన ఆధిపత్యాన్ని విస్తరించుకున్న ఈస్ట్ ఇండియా కంపెనీని గుర్తుకు తేవడం సహజం.
అక్కడ లండన్ కంపెనీ అయితే, ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ. 13 వలస కాలనీలు బ్రిటన్‌కు పాడి ఆవులుగా మారాయి. వర్జీనియా నుంచి పొగాకు, దక్షిణ ప్రాంతాల నుంచి బియ్యం, ఇండిగో, ఉత్తర ప్రాంతాల నుంచి కలప, చేపలు, జంతుచర్మాలు బ్రిటన్‌కు చేరేవి. అక్కడి పరిశ్రమలు వాటిని విలువైన ఉత్పత్తులుగా మార్చి తిరిగి అదే కాలనీల్లో విక్రయించేవి. భారత్‌లోనూ ఇదే ఒరవడి కనిపించింది. పత్తి, నీలిమందు, సుగంధద్రవ్యాలు, ఖనిజాలు బ్రిటన్‌కు చేరాయి. మాంచెస్టర్‌లో తయారైన వస్ర్తాలు భారత్ మార్కెట్లను ముంచెత్తాయి. తాము పండించిన పత్తినే వస్ర్తాల రూపంలో తిరిగి అధిక ధరలకు కొనాల్సిన దుస్థితి భారతీయులకు ఎదురైంది.
1763లో బ్రిటన్, ఫ్రాన్స్, మధ్య ఐరోపాతోపాటు ఉత్తర అమెరికా లోనూ ఆధిపత్యం కోసం సాగిన చారిత్రాత్మక ‘ఏడేండ్ల యుద్ధం’ ముగిసే నాటికి, మితిమీరిన యుద్ధవ్యయంతో బ్రిటన్ అప్పులకుప్పగా మారింది. దాంతో వలస పాలకులు కొత్త పన్నులతో అమెరికన్ల నడ్డి విరిచారు. ‘ప్రాతినిధ్యం లేకుండా పన్నులు వద్దు’ అనే నినాదం అమెరికా స్వాతంత్య్రోద్యమానికి నాంది పలికింది. ఈ నినాదం ఎంతటి జాతీయ చైతన్యాన్ని రగిలించిందో, అంతకుమించిన స్వాతంత్య్రకాంక్షను ‘స్వరాజ్యం నా జన్మహక్కు’ అనే నినాదం భారతీయుల్లో రగిలించింది. గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం ద్వారా ఆ నినాదం స్వాతంత్య్రోద్యమ దిశగా మళ్లించారు.
1773 డిసెంబర్లో జరిగిన బోస్టన్ టీ పార్టీ అమెరికా చరిత్రలో మరపురాని ఘట్టం. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన నౌకల్లో ఉన్న 342 టీ పెట్టెలను నిరసనకారులు సముద్రంలో విసిరి, వలసవాద ఆర్థిక విధానాలపై తమ నిరసనను ప్రపంచానికి చాటిచెప్పారు. భారత్‌లో ‘స్వదేశీ’ ఉద్యమ సమయంలో ప్రజలు విదేశీ వస్ర్తాలను స్వచ్ఛందంగా దహనం చేశారు. రెండు దేశాల లక్ష్యం మాత్రం సామ్రాజ్యవాద ఉత్పత్తులను తిరస్కరించడమే. బోస్టన్ టీ పార్టీ తర్వాత బ్రిటన్ మరింత కఠినంగా వ్యవహరిస్తూ అక్కడి నౌకాశ్రయాన్ని మూసివేసింది. భారత్‌లోనూ ఇదే జరిగింది. బెంగాల్ విభజన వంటి ఏకపక్ష చర్య స్వదేశీ ఉద్యమాన్ని గడప గడపకూ చేర్చింది. రౌలత్ చట్టం దేశవ్యాప్త ఆందోళనలకు కారణమైంది. జలియన్‌వాలాబాగ్ మారణకాండతో ఉద్యమం తీవ్రరూపు దాల్చింది.
1774లో అమెరికాలోని ఫిలడెల్ఫియాలో కాంటినెంటల్ కాంగ్రెస్ సమావేశమైంది. 13 కాలనీల ప్రతినిధులు తొలిసారి ఒకే వేదికగా ఐక్యకార్యాచరణపై చర్చించారు. భారతీయులకు ఈ దృశ్యం 1885లో బొంబాయిలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ తొలి మహాసభను గుర్తు చేస్తుంది. ఆ తర్వాత 1906 కలకత్తా మహాసభ, 1929 లాహోర్ మహాసభలు భారత స్వాతంత్య్రోద్యమానికి దిశానిర్దేశం చేసినట్లే, కాంటినెంటల్ కాంగ్రెస్ విడివిడిగా పోరాడుతున్న అమెరికా కాలనీలను ఒకే గొడుగు కిందికి చేర్చింది.
1776 జూలై 4న ఫిలడెల్ఫియాలో సమావేశమైన రెండో కాంటినెంటల్ కాంగ్రెస్ అమెరికా స్వాతంత్య్ర ప్రకటనను ఆమోదించింది. అమెరికా 250వ స్వాతంత్య్ర వార్షికోత్సవానికి ఇదే చారిత్రక మూలం. 1775లో లెక్సింగ్టన్, కాన్కార్డ్ ప్రాంతాల్లో జరిగిన కాల్పుల పర్యవసానంగా అమెరికా స్వాతంత్య్ర సమరం ప్రారంభమైంది. అప్పటికే ప్రజాభిమానాన్ని చూరగొన్న జార్జ్ వాషింగ్టన్ అమెరికా సైన్యాధ్యక్ష బాధ్యతలను స్వీకరించాడు. భారత స్వాతంత్య్రోద్యమంలో గాంధీ వంటి నాయకులు లక్షలాది మంది ప్రజలను అహింసాయుతంగా సంఘటితం చేస్తే, అమెరికాలో సాయుధ పోరాటానికి వాషింగ్టన్ నేతృత్వం వహించాడు.
సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, భారత్ ఛోడో ఆందోళనల ద్వారా గాంధీ జాతీయోద్యమానికి చిరునామాగా మారినట్లే, అమెరికాలో స్వాతంత్య్ర స్ఫూర్తికి ప్రతీకగా వాషింగ్టన్ నిలిచాడు. థామస్ జెఫర్సన్ స్వాతంత్య్ర ప్రకటనకు రూపకల్పన చేశాడు. బెంజమిన్ ఫ్రాంక్లిన్ పోరాటానికి ఫ్రాన్స్ మద్దతు సాధించాడు. జాన్ ఆడమ్స్ కాంగ్రెస్‌లో స్వాతంత్య్రానికి బలమైన రాజకీయ వాదన వినిపించాడు. అలెగ్జాండర్ హామిల్టన్ యుద్ధ సమయంలో వాషింగ్టన్కు అండగా నిలిచి, తర్వాత దేశ అర్థవ్యవస్థకు బలమైన పునాది వేశాడు. ఇదే తరహాలో భారత స్వాతంత్య్రోద్యమంలో గాంధీ, నెహ్రూ, సర్దార్ పటేల్, సుభాష్ చంద్రబోస్, రాజాజీ, డాక్టర్ బీఆర్అంబేద్కర్ వంటి ఎందరో నాయకులు తమ తమ రంగాల్లో కీలక పాత్ర పోషించారు. ఉభయదేశాల స్వాతంత్య్రోద్యమాల అంతిమ లక్ష్యం ఒక్కటే-స్వేచ్ఛ. ప్రజల సంకల్పం ముందు ఎంతటి సామ్రాజ్యమైనా తలవంచక తప్పదని ఈ రెండు దేశాల చరిత్ర ప్రపంచానికి నిరూపించింది.
– కృష్ణబాలాజి పల్లపోతు 99490 98406