న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: స్టార్టప్‌ల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఒక ఈక్విటీ ఫండ్‌ను ఏర్పాటు చేయనుంది. స్టార్టప్‌లను నెలకొల్పే వాణిజ్యవేత్తలకు అదనపు మూలధన మద్దతును అందించేందుకు ఆయా స్టార్టప్‌ల్లో 20 శాతం వరకూ వాటా తీసుకోవడానికి ఈ ఫండ్‌ను నెలకొల్పుతున్నామని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ ఫండ్ వివరాల్ని రాజీవ్ శనివారం సీఐఐ సదస్సులో వివరించారు. ఈ ఫండ్‌ను ప్రైవేట్ ఫండ్ మేనేజర్లు నిర్వహిస్తారని, స్టార్టప్‌లో పెట్టుబడి చేసి లిమిటెడ్ భాగస్వామిగా 20 శాతం వాటా వరకూ తీసుకోనున్నట్టు వివరించారు.
దీంతో ప్రస్తుతం స్టార్టప్‌లకు అందుబాటులో ఉన్న ప్రైవేట్ ఈక్విటీ మూలధనానికి ఇది మరింత తోడ్పాటుగా ఉంటుందన్నారు. పర్యావరణం, డిజిటల్ ఎకానమీ, ఫార్మా, ఆగ్రిటెక్ తదితర ప్రాధాన్యతగల కొత్త రంగాలకు ప్రభుత్వం ఫండ్స్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ఇప్పటికే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్‌ను రూ. 945 కోట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేయగా, దీనికి తోడు కొత్తగా స్టార్టప్‌ల్లో భాగస్వామ్యంగా పెట్టుబడి చేసేందుకు ఈక్విటీ ఫండ్‌ను సైతం నెలకొల్పనున్నది.