హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 31 (నమస్తే తెలంగాణ): మాదక ద్రవ్యాల ముఠా గుట్టు రట్టయింది. సప్లయర్ తోపాటు ముగ్గురు డ్రగ్స్ వినియోగదారులు అరెస్టయ్యారు. మాదక ద్రవ్యాల నిరోధక యంత్రాంగం ఈ ముఠా చుట్టూ ఉచ్చు బిగించిన సమయంలో డ్రగ్స్‌కు బానిసగా మారి ప్రాణాలు కోల్పోయిన ఒక యువకుని ఉదంతం కూడా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌ను ఉక్కుపాదంతో అణచి వేసేందుకు హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్‌న్యూ) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
డ్రగ్స్ అమ్మకాలకు సంబంధించి ఒక ముఠాపై నిఘా పెట్టి, కొంతమంది యువకులను అదుపులోకి తీసుకున్నప్పుడు బీటెక్ విద్యార్థి మృతి సమాచారం పోలీసుల దృష్టికి వచ్చింది. నగర పోలీస్ అదనపు సీపీ డీఎస్ చౌహాన్ గురువారం విలేకరుల సమావేశంలో ఈ సంగతి వెల్లడించారు. డీడీ కాలనీ శివం రోడ్డులో నివాసముండే ప్రేమ్ ఉపాధ్యాయ్ రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు డ్రగ్స్ దందా కూడా చేస్తున్నాడు. లక్ష్మీపతి అనే వ్యక్తి వద్ద రూ.1500 చొప్పున 5 గ్రాముల హాషిష్ ఆయిల్ బాటిల్‌ను కొని, దానిని రూ.3 వేలకు మార్కెట్లో విక్రయిస్తున్నాడు. ఎక్స్టసీ పిల్స్‌ను రూ.1000కి కొని రూ.3 వేలకు ఒకటి చొప్పున విక్రయిస్తున్నాడు. ప్రేమ్ దందాపై ‘హెచ్‌న్యూ’కు అందిన విశ్వసనీయ సమాచారంతో అతని కదలికలపై నిఘా పెట్టారు.
ఈ క్రమంలో గురువారం నల్లకుంట కూరగాయల మార్కెట్ వద్ద డ్రగ్స్ విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా ప్రేమ్‌తో పాటు కొండాపూర్‌కు చెందిన సాప్ట్వేర్ ఉద్యోగి రామకృష్ణ, నార్సింగ్‌కు చెందిన గిటార్ టీచర్ నిఖిల్ ఝాస్వ, తార్నాకకు చెందిన బీటెక్ విద్యార్థి జీవన్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఆరు ఎల్ఎస్డీ బాటిల్స్, 10 ఎక్స్టసీ పిల్స్, 100 గ్రాముల హాషిష్ ఆయిల్, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. హెచ్‌న్యూ, నల్లకుంట పోలీసులు సంయుక్తంగా నిందితులను పట్టుకున్నారు. ప్రేమ్ గ్యాంగ్‌కు డ్రగ్స్ సరఫరా చేసిన లక్ష్మీపతి పరారీలో ఉన్నాడు, అతని కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.
డ్రగ్స్ బాధితుడి వీడియో విజువల్స్
ప్రేమ్ స్నేహితుడైన అశోక్‌నగర్‌కు చెందిన యువకుడు రెండేండ్లుగా డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. ప్రేమ్ నెట్వర్క్ గురించి ఆరా తీసిన హెచ్‌న్యూ 9 మందిని సంప్రదించింది. అందులో ఒక వ్యక్తి నిమ్స్ దవాఖానలో ఉన్నట్టు గుర్తించారు. మూడు రోజుల క్రితం ఆ యువకుడు డ్రగ్స్ దుష్ఫలితాల వల్ల మరణించాడు. అతడు మంచం మీద నిస్సహాయ స్థితిలో పడి ఉన్న వీడియోను పోలీసులు మీడియా సమావేశంలో ప్రదర్శించారు. డ్రగ్స్ వాడకం వల్ల కలిగే అనర్థాలను అదనపు సీపీ మీడియాకు పీపీటీ ద్వారా వివరించారు.
డ్రగ్స్ ఓవర్ డోస్‌తోనే విద్యార్థి మృతి
వైద్యనిపుణుల ధృవీకరణ
డ్రగ్స్‌కు బానిసైన బీటెక్ విద్యార్థి ఓవర్డోస్తో బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురై మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. ఈ నెల 19న తీవ్ర అస్వస్థత, విచిత్ర ప్రవర్తనతో రోగిని అతడి కుటుంబ సభ్యులు నిమ్స్‌లో చేర్పించారని, స్నేహితులను ఆరా తీయగా అతడు ఎల్ఎస్డీ బ్లాట్లు, కెనబిస్ తదితర రెండుమూడు రకాల డ్రగ్స్ తీసుకున్నట్టు తెలిసిందని పేర్కొన్నారు. డ్రగ్స్‌ను మోతాదుకు మించి తీసుకోవడంతో నాడీవ్యవస్థ దెబ్బతిన్నదనీ, బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చిందని వైద్యులు వెల్లడించారు. అంతర్గత అవయవాలు చెడిపోవడంతో రోగి మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు.