BTech Student | దుండిగల్, మార్చి2: విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించాల్సిన విద్యాలయాలు వికృత చేష్టలకు వేదికలుగా మారుతున్నాయి. హైదరాబాద్ బాచుపల్లి (ప్రగతినగర్) పరిధిలో ఉన్న ఓ ఇంజినీరింగ్ కళాశాలలో సభ్యసమాజం తలదించుకొనే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తోటి విద్యార్థినికి మత్తు చాక్లెట్లు ఇచ్చిన ఓ విద్యార్థి ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా.. నెలల తరబడి బ్లాక్మెయిల్ చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అదే కళాశాలలో ఇంజినీరింగ్ తృతీయ సంవత్సరం చదువుతున్న బాధితురాలికి మెకానికల్ బ్రాంచికి చెందిన ఆశీష్ తనే(21) అనే విద్యార్థి పరిచయమయ్యాడు. ఏడాదిన్నర కాలంగా ప్రేమ పేరుతో ఆమె వెంటపడి నమ్మించాడు. పక్కా ప్లాన్‌తో ఆమెకు గంజాయి కలిపిన చాక్లెట్ ఇచ్చాడు. ఆమె స్పృహ కోల్పోగానే కళాశాల తరగతి గదిలోనే ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆపై ఆ దృశ్యాలను ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తూ పలుమార్లు ఓయో రూమ్‌లకు తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు.
ఆశీష్ తనే ఒక్కడే కాకుండా అతని స్నేహితుడు ప్రవీణ్ అనే మరో విద్యార్థి కూడా బాధితురాలైన విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించేవాడు. తన స్నేహితుడి మాదిరిగానే తన కోరిక తీర్చాలని పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆమెను అసభ్యంగా తాకుతూ వికృతంగా ప్రవర్తించేవాడు. ఈ నెల 17న ప్రవీణ్ లైంగికదాడికి యత్నించగా, అతని బారి తప్పించుకున్న ఆ యువతి తను ఉంటున్న అమ్మమ్మ ఇంట్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సమయంలోనే జరిగిన ఘోరాన్ని ఆమె తన తల్లికి చెప్పుకొన్నది. ఈ మేరకు విద్యార్థిని తల్లి శనివారమే బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దారుణాలు వెలుగులోకి వచ్చాయి. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం.
ఒక ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్ కళాశాలలో ఇలాంటి ఘటన జరుగడం స్థానికంగా కలకలం సృష్టిస్తున్నది. ఈ విషయాన్ని బాధితురాలు కళాశాల యాజమాన్యానికి మొరపెట్టుకున్నా, వారు ఈ విషయాన్ని బయటకు రాకుండా అణచివేసేందుకు ప్రయత్నించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఆశీష్ ఓ రోజు కళాశాల తరగతి గదిలోనే యువతిపై లైంగికదాడికి పాల్పడుతూ సెక్యూరిటీకి దొరుకగా వారిని మేనేజ్ చేసినట్టు బాధితులు ఆరోపించారు. కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే నిందితులు రెచ్చిపోయినట్టు తెలుస్తున్నది. ఈ ఘటన వెలుగులోకి రాకుండా కళాశాల యాజమాన్యం, పోలీసులు వ్యవహరించడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.