హైదరాబాద్, ఆగస్టు 23, (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఉద్యోగుల ఆరోగ్య పథకంలో (ఈహెచ్ఎస్) అనేక నష్టదాయక నిబంధనలు విధించిందని, వెంటనే వాటిని సవరించాలని టీయూఎంహెచ్ఈయూ నేతలు ఎండీ ఫసియుద్దీన్, కే యాదవ్ నాయక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. మూల వేతనం నుంచి 1.5 శాతం చందా మినహాయించుకున్నా, ప్రభుత్వం తన వాటా జమ చేయకపోవడం అనాలోచితమని పేర్కొన్నారు.
రూ.3 లక్షల వైద్య పరిమితి విధించడం, ప్రైవేట్ దవాఖానల నెట్వర్క్తో ఒప్పందాలు కాలయాపన చేయడంతో నగదు రహిత వైద్యం సాధ్యపడటం లేదని తెలిపారు. ఆపద సమయంలో వెల్నెస్ సెంటర్ల చుట్టూ తిరగాలనే షరతును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పరిమితి లేని నగదు రహిత వైద్యాన్ని అందించాలని, ఇష్టంలేని ఉద్యోగులను ఈ పథకం నుంచి వెసులుబాటు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. లేకుంటే పెద్దఎత్తున ఆందోళన చేపడుతామని వారు హెచ్చరించారు.