హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం జిల్లా, జోన్, మల్టీజోన్వారీగా ఉద్యోగుల కేటాయింపు పూర్తయింది. కొత్తగా కేటాయించిన చోట్ల ఉద్యోగులు రిపోర్ట్ చేస్తున్నారు. జోనల్, మల్టీజోనల్ ఉద్యోగులు రాష్ట్రంలో 80 వేలమంది ఉండగా, వారిలో 6వేల తమకు కేటాయించినచోటికి మారినట్టు తెలిసింది. అన్నిస్థాయిలో ఉద్యోగులకు పోస్టింగుల ఆధారంగా ఉన్నతాధికారులు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఇప్పటివరకు 14 వేల మంది ఉద్యోగులకు బదిలీ ఉత్తర్వులు అందినట్టు తెలిసింది. కొన్నిచోట్ల భార్యాభర్తలకు జోన్లు, జిల్లాలు మారడంతో ఉద్యోగుల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో భార్యాభర్తలు ఒకేచోట పనిచేసేలా ఉత్తర్వులివ్వాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించటంతో ఆ మేరకు మార్పులు చేస్తున్నారు. ఉద్యోగుల అప్పీళ్ల పరిష్కారంలో ఇతరులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని ఉన్నతాధికారులకు సీఎం కేసీఆర్ సూచించటంతో ఆ దిశగా కేటాయింపులు, పోస్టింగ్‌లు, బదిలీల ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించారు. అప్పీళ్లు, స్పౌజ్ కేసుల పరిశీలన తరువాత మ్యూచువల్ ట్రాన్స్ఫర్లపై దృష్టిపెట్టనున్నారు. నేడోరేపో స్పౌజ్ కేసులకు సంబంధించి ఉత్తర్వులు జారీచేసే అవకాశం ఉన్నది. సంక్రాంతి నాటికి ఈ ప్రక్రియ పూర్తిచేసి, ఉద్యోగ ఖాళీల సంఖ్యపై అంచనాకు రానున్నారు.
14 వేల మందికి బదిలీ ఉత్తర్వులు
జిల్లా క్యాడర్ ఉద్యోగుల బదిలీ ప్రక్రియ చివరిదశకు చేరుకొన్నది. ఇతర జిల్లాలకు మారినవారికి కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్‌లు ఇస్తున్నారు. జిల్లా క్యాడర్లో ఇప్పటి వరకు టీచర్లు మినహా మిగతా ఉద్యోగుల్లో 14 వేల మందికి బదిలీ ఉత్తర్వులు జారీచేసినట్టు సమాచారం. బదిలీ ఉత్తర్వులు అందినవారు మూడురోజుల్లోగా విధుల్లో చేరాల్సి ఉంటుంది. జిల్లా క్యాడర్లో మిగిలినవాళ్ల బదిలీ ఉత్తర్వులు ఒకటిరెండు రోజుల్లో జారీచేయనున్నారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా టీచర్ల విభజన కూడా చేపట్టనున్నారు. ఖాళీలు ఉంటేనే స్పౌజ్ కేసు దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవాలని గతంలో ఉత్తర్వులు ఉన్నాయి. దీంతో స్పౌజ్ ఆప్షన్ ద్వారా చాలామంది ఉద్యోగులు సర్దుబాటయ్యే అవకాశం ఉండకపోవచ్చని తెలుస్తున్నది.
టీచర్ల కేటాయింపు సమస్యలు పరిష్కరించాలి
టీచర్ల కేటాయింపులో గందరగోళాన్ని త్వరగా పరిష్కరించాలని తెలంగాణ సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం విజ్ఞప్తిచేసింది. జీవో-317 ద్వారా ఉద్యోగులు, ఉపాధ్యాయులను ప్రెసిడెన్షియల్ ఆర్డర్-2018 ప్రకారం కొత్త జిల్లా, జోనల్, మల్టీ జోనల్‌కు సర్దుబాటు చేయడం సరైనదేనని సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కమలాకర్, భూపతిరావు పేర్కొన్నారు.
స్పౌజ్‌కు ప్రాధాన్యమివ్వాలి
ఉద్యోగుల కేటాయింపులో భార్యాభర్తలు ఒకేచోట పనిచేసేలా అవకాశం కల్పించాల్సి ఉన్నది. పరస్పర అవగాహనతో మ్యూచువల్గా బదిలీ కావడానికి అవకాశం కల్పించాలి. పోస్టుల కేటాయింపుల్లో యూనియన్ ఆఫీస్ బేరర్లకు అవకాశం ఇవ్వాలి. దివ్యాంగులకు నియామకాల సమయంలో 40 శాతం అంగవైకల్యంతో సర్టిఫికెట్ ప్రకారం నియామకాలు చేపట్టారు.