న్యూయార్క్: ప్రపంచ కుబేరుల్లో రెండోస్థానంలో ఎలోన్ మస్క్ కొత్త రికార్డు సృష్టించారు. ఒకే రోజు ఆయన సంపాదన ఏకంగా 1.82 లక్షల కోట్లు (2500 కోట్ల డాలర్లు) పెరగడం విశేషం. టెస్లా షేర్లు 20 శాతం పెరగడంతో మస్క్ మరింత సంపన్నుడయ్యారు. ప్రస్తుతం ఆయన సంపద విలువ 12.70 లక్షల కోట్ల (17400 కోట్ల డాలర్లు)కు చేరింది. ఈ ఒక్క రోజు సంపాదనతో బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో తొలి స్థానంలో ఉన్న జెఫ్ బెజోస్‌కు మస్క్ చేరువయ్యారు. మరోవైపు ఆపిల్, అమెజాన్, ఫేస్‌బుక్‌లాంటి టెక్ కంపెనీల షేర్లు లాభపడటంతో నాస్డాక్ రాత్రికి రాత్రి 3.7 శాతం లాభపడింది. అమెజాన్ షేర్లు లాభపడటంతో బెజోస్ కూడా ఒక్క రోజు 600 కోట్ల డాలర్లు సంపాదించారు. దీంతో ఆయన మొత్తం సంపద విలువ రూ.13.13 లక్షల కోట్లు (18000 వేల కోట్ల డాలర్లు)కు చేరింది. గత జనవరిలో బెజోస్‌ను వెనక్కి నెట్టి ఎలోన్ మస్క్ ప్రపంచ కుబేరుడిగా అవతరించినప్పటి నుంచీ ఈ ఇద్దరి మధ్య తొలిస్థానం కోసం తీవ్ర పోటీ నడుస్తోంది.