బజార్ హత్నూర్ : ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ ( Bazar Hatnoor ) మండలంలోని పంట పొలాల్లో విద్యుత్ తీగలు (Electric wires) యమా పాశాలుగా మారుతున్నాయి. విద్యుత్ స్తంభాలు విరిగి పోయి, మరికొన్ని చోట్ల నెలకు వంగి ఉండడంతో తీగలు పంట పొలాల్లో పడి వ్యవసాయ పనులకు ఆటంకం కలిగిస్తున్నాయి. చేతికి అందేలా విద్యుత్ తీగలు ఉండడంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని రైతులు పంట పొలాల్లో పనులు చేసుకుంటున్నారు.
మరో పక్క మండల కేంద్రంలో వాడ వాడల్లో డీడీ ఆర్ కనెక్షన్లు లేక , ఉన్న ట్రాన్స్పార్మర్ల నుంచి విద్యుత్ కనెక్షన్లు అధికం కావడంతో ఓవర్ లోడ్ అయి కరెంట్ కోతలు అధికమవుతున్నాయి. సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా సమస్యలను పరిష్కరించడం లేదని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా పంట పొలాల్లో ఉన్న విద్యుత్ సమస్యలతో పాటు గ్రామాల్లో డీడీ ఆర్ కనెక్షన్లను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.