న్యూఢిల్లీ, జూన్ 18: ఓటర్ కార్డులను ఓటర్లకు అందజేయటంలో జరుగుతున్న జాప్యాన్ని సగానికి తగ్గిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఒక నూతన వ్యవస్థను తీసుకొచ్చింది. 15 రోజుల్లోగా ఓటర్ కార్డు డెలివరీ అయ్యే విధంగా ‘ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని’ (ఎస్వోపీ) రూపొందిస్తున్నట్టు ఈసీ బుధవారం ప్రకటించింది. ఓటర్ల జాబితాలో మార్పులు, కొత్తగా పేరు నమోదు వంటివి ఓటర్ కార్డులో అప్డేట్ జరిగిన 15 రోజుల్లోగా ఓటరు గుర్తింపు కార్డును ఓటర్‌కు పంపేందుకు కొత్త విధానాన్ని అనుసరించబోతున్నట్టు ఈసీ తెలిపింది.
ప్రస్తుతమున్న ఐటీ మాడ్యూల్‌ను మార్చి, కొత్త ప్లాట్‌ఫామ్ ఏర్పాటుచేశామని వెల్లడించింది. ప్రస్తుత విధానంలో ఎలక్టర్ ఫొటో గుర్తింపు కార్డు (ఎపిక్)ను ఓటర్లకు పంపడానికి నెల రోజులపైన సమయం తీసుకుంటున్నది. కొత్త విధానంలో ఎపిక్ జనరేషన్ నుండి పోస్ట్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ (డీవోపీ) ద్వారా ఓటర్‌కు కార్డు డెలివరీ అయ్యే వరకు ప్రతి దశ రియల్-టైమ్ ట్రాకింగ్‌ను ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్వో) ద్వారా నిర్ధారిస్తామని ఎన్నికల కమిషన్ తెలిపింది. ఓటర్లు ప్రతి దశలో ఎస్సెమ్మెస్ ద్వారా నోటిఫికేషన్లు అందుకుంటారని, తద్వారా తమ ఎపిక్ కార్డు స్థితిని వారికి తెలియజేస్తామని ఈసీ వివరించింది.