టేకుమట్ల, సెప్టెంబర్ 26 : పెన్షన్ డబ్బుల కోసం వెళ్లిన వృద్ధుడు తిరిగి వస్తూ వాగులో గల్లంతైన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం ద్వారకాపేటలో శనివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ద్వారకాపేటకు చెందిన చిటికెల రవీందర్‌రెడ్డి(65) పింఛన్ డబ్బుల కోసం స్థానికులతో కలిసి శనివారం సమీపంలోని చలివాగు దాటి ఎంపేడు గ్రామానికి వెళ్లాడు.
పెన్షన్ డబ్బులు తీసుకున్న అనంతరం తిరిగి ద్వారకపేటకు వస్తుండగా చలివాగు దాటే క్రమంలో తన తోటి వారిని వదిలి నేను వెనక వస్తా .. మీరు పదండి .. అనడంతో వారు వాగు దాటారు. రవీందర్‌రెడ్డి వాగు దాటుతున్న క్రమంలో వరద ప్రవాహం పెరగడంతో నీటిలో పడి గల్లంతయ్యాడు. సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు, పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని రెస్క్యూ టీమ్‌తో గాలింపు చేపట్టినా సాయంత్రం వరకూ రవీందర్‌రెడ్డి ఆచూకీ లభించలేదు.