తొర్రూరు, జూలై 29 :మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో దుర్మరణం చోటు చేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిన ఘటనలో ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వెలికట్టే గ్రామానికి చెందిన మాసాని ఐలయ్య (65) మతిస్థిమితం లేకపోవడంతో చుట్టుపక్కల గ్రామాల్లో తిరుగుతూ ఉంటాడు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఐలయ్య వెలికట్టే గ్రామం నుంచి తొర్రూరు హైవేపై నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తుతెలియని పెద్ద వాహనం అతడిని ఢీకొట్టింది.
దీంతో ఐలయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం వర్ధన్నపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుడికి కుమారుడు సైదులు, కుమార్తె ఎల్లమ్మ ఉన్నారు. కుమారుడు సైదులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఎస్ఐ ఉపేందర్ తెలిపారు.