కుభీర్ : నిర్మల్ జిల్లా కుభీర్ మండలం చాత గ్రామంలో వృద్ధుడిని దుండగులు దారుణంగా హత్య (Murder ) చేశారు . కుబీర్ ఎస్సై ఏ కృష్ణారెడ్డి ( SI Krishna Reddy ) తెలిపిన ప్రకారం వివరాలు .. మండలంలోని చాత గ్రామానికి చెందిన తాళ్లపల్లి బలరాం గౌడ్ (70) అనే వృద్ధుడు గురువారం దుకాణంలో తెల్ల కల్లును విక్రయించి ఇంటికి వెళ్లిపోయాడు.
గురువారం ఉదయమే బలరాం గౌడ్ ( Balaram Goud ) కుమారుడు తన భార్య పిల్లలతో కలిసి వేములవాడకు అత్తగారింటికి వెళ్లారు. అర్ధరాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు లోనికి ప్రవేశించి బలరాం గౌడ్ కత్తితో మెడ కోసి హత్య చేశారని తెలిపారు. స్థానికులు కుభీర్ పోలీస్ స్టేషన్కు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ , ఎస్సై సంఘటన స్థలాన్ని పరిశీలించారు
. అనంతరం ఫింగర్ ప్రింట్స్, డాగ్ స్క్వాడ్ బృందాలను పిలిపించి వివరాలను నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. పంచనామా అనంతరం శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. కుమారుడు రమేష్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.