El Nino : ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. ఉదయం ఎనిమిది గంటలు కాకముందే భానుడు భగ్గుమంటున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఫలితంగా రాష్ట్ర ప్రజలు అకాల వేడితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిజామాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లో గరిష్ఠంగా 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇది సాధారణం కంటే 4 డిగ్రీలు అధికం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 34 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు కాగా.. హైదరాబాద్లో సాధారణ ఉష్ణోగ్రత 31.8 డిగ్రీలకు బదులుగా ప్రస్తుతం 34 డిగ్రీలుగా నమోదవుతున్నది. ఎల్ నినో ప్రభావంవల్లే వాతావరణంలో ఈ మార్పులు చోటుచేసుకుంటున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రానున్న రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 2 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు.