ఎదులాపురం, మార్చి11 : జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ శిక్షణ అధికారుల పర్యటన పూర్తియిన సందర్భంగా కలెక్టరేట్ సమవేశ మందిరంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో సంక్షేమ పథకాల అమలు, ప్రజల జీవన విధానం, విద్య, వైద్యం తదితర అంశాలపై అధ్యయనం చేసిన నివేదికను శిక్షణ అధికారులు కలెక్టర్‌కు వివరించి, సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా కృషిచేస్తున్నామన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు, రైతుబంధు, దళిత బస్తీ, పల్లెప్రగతి, మిషన్ భగీరథ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, ఆసరా పింఛన్లు తదితర పథకాలను జిల్లాలో పటిష్టంగా అమలుచేస్తున్నట్లు వివరించారు. అనంతరం శిక్షణ అధికారులకు జ్ఞాపిక అందించి, శాలువాలతో కలెక్టర్ సన్మానించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ఎన్ నటరాజ్, రిజ్వాన్ బాషా షేక్, సివిల్ సర్వీసెస్ అధికారులు, ఆర్డీవో రాజేశ్వర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆశాకుమారి, డీపీవో శ్రీనివాస్, జిల్లా పర్యాటక శాఖ అధికారి రవీందర్, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం అధికారులతో ప్రధానమంత్రి స్వనిధి, పంట రుణాలు, మహిళా సంఘాల రుణాలు, వివి ధ సంక్షేమ పథకాల ద్వారా మంజూరైన యూనిట్ల గ్రౌండింగ్‌పై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి స్వనిధి యోజన కింద వీధి వ్యాపారులకు త్వరితగతిన రుణాల మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు. బ్యాంకుల వారీగా రుణాల మంజూరుకు మెప్మా, మున్సిపల్, బ్యాంకు అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకు లింకేజి కింద రుణాలను లక్ష్యం మేరకు మంజూరు చేసి, వసూళ్లలో సంబంధిత శాఖల సహకారం తీసుకోవాలని సూచించారు. సూక్ష్మ, మధ్య, ముద్ర, వీధి వ్యాపారుల రుణాలు లక్ష్యానికి అనుగుణంగా అందించాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్డీవో కిషన్, ఎల్డీఎం చంద్రశేఖర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, మున్సిపల్ కమిషనర్ శైలజ, మెప్మా డీఎంసీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.