నల్లరాతి మందిరాన/ నరసింహా! నీ రూపం
వేదాలకు ప్రతిరూపం/ యాదాద్రికి మణిదీపం
యాదుని నిర్మలభక్తిని/ ఆదరించి వెలిశావే
కలుముల వెలుగులే కురియ/ కలియుగాన నిలిచావే..
భూత ప్రేతాలన్ని/ బూడిదలో కలుస్తాయి
నీ చల్లని చూపులతో/ కుశలాలే నిలుస్తాయి
శిల్పకళాశోభితమై/ కల్పాంతం నీ కోవెల
భక్తజనావళికి కొంగు/ బంగారం కాదా ఇల?
పుణ్యభూమి భరతధాత్రి/ వెలుగుతోంది నీ దయతో
భువనం వైకుంఠంలా/ నిలుస్తోంది నీ కృపతో
కలువ కొలనులో చంద్రుడు/ జిలుగులతో వెలుగు
కలువకుంట్ల చంద్రుడు నీ/ కరుణనిండ నిలుచు
తలచినంతనే భక్తుల/ కలలను పండిస్తావు
పిలిచినంతనే గృహాల/ సిరులను నిండిస్తావు
లక్ష్మీనిలయుడవు నీవు/ లాలించే తండ్రి నీవు
పాలించే తల్లి నీవు/ నడిపించే సఖుడవీవు
అనుక్షణం నీ ధ్యానం/ అదే కదా నా ప్రాణం
అనవరతం నీ నామం/ భవతరణకు వరధామం
భక్తజనావళికి అండ/ నీవు నిలిచియుండు కొండ
మదినీవే నిండియుండ/ కొదవలేదు ఇంటినిండ
డాక్టర్ ,ఆయాచితం
నటేశ్వరశర్మ
94404 68557