వాడి గుప్పెట్లో
మట్టితో పాటు గింజల్ని పోసి
చల్లించండి.
చిట్టి పాదాలకు
మట్టి స్పర్శను చూపి
లేత చూపునకు మొలక గుర్తుల్ని
పరిచయం చేయండి
నేల ఒడిలో వదిలిపెట్టండి
మొక్కలతో కబుర్లు చెప్పుకొంటూ
మురిసిపోనీయండి.
పచ్చని అందాల మధ్య
కేరింతలు పారనీయండి
పూల మధ్యలో
నవ్వులను ఏరుకోనీయండి.
మొగ్గలను ముద్దుపెట్టుకోనీయండి
పూతలను తాకనీయండి
కాయలపై కోరికను తీర్చుకోనీయండి
చురుకుతనంపై కరుకుతనం చూపకండి.
రోజూ కొంత సమయాన్ని
ఖర్చు చేసుకోనీయండి
విస్తృతంగా ఎగరనీయండి
విశాలంగా విహరించనీయండి
నేల ఆనందిస్తుంది
పచ్చిక పులకిస్తుంది
మనసు వికసిస్తుంది
మనిషి కనిపిస్తాడు.
చందలూరి
నారాయణరావు
83094 63567