ఒక్క దెబ్బతో
చెదరగొట్టావు గదరా!
కష్టజీవుల ఉసురు
ఊరికే పోదు.
ఎంత చక్కని వరుస బంతులవి!
అలవిగాని బరువుల్ని
అలవోకగా
మోసుకెళ్తున్నాయి.
అలసటెరుగని బుజ్జి కాళ్లు
అన్వేషణ మానని చిన్ని కళ్లు
దూరాలు వాటికో లెక్కా!
ఎదురొచ్చే వాకిళ్లు.
ఒక గొప్ప వ్యవస్థను
అవమానించావు
క్రమశిక్షణను ఒక్క క్షణంలో
కాలరాచావు.
సైజు ఒక్కటే
క్రైటీరియా కాదు
అల్పాకృతులే కావచ్చు
కానీ నిత్య క్రియా ఝంకృతులు.
ఏమి యాత్ర వాటిది!
వలస కార్మికులు గుర్తుకొస్తున్నారు,
వాటి కదలికలను పట్టుకొని
వెళ్లగావెళ్లగా
ఒక అపురూప బిలాన్ని చేరుకుంటాం.
అదొక వల్మీకం
ఒక పొదుగుతున్న నిశ్శబ్దం
కలగా పులగమయ్యే అక్షరాలు
వాల్మీకి జననానికి ఆనవాళ్లు.
చీమలంటే
చిన్నచూపు పోలేదు నీకు
వాటికి మేధస్సు లేదనీ
అవి నవ్వుతాయా అని
నీ అవహేళన
నడుస్తున్నట్టు కనిపిస్తాయి
కాని అది పరుగు
కాలాన్ని ముక్కలుగా
కత్తిరించి వాడుకుంటాయి.
పనిని మించిన
ఫిలాసఫీ ఉంటుందా ఎక్కడైనా!
ఆ ప్రక్రియలోనే
జీవుల సంవేదన గానీ
సంవాదన గానీ పుట్టేది.
పద!
చీమల వెంట కాస్సేపు నడుద్దాం
ఇది కేవలం పిపీలికం కాదు
బ్రహ్మాండమైన శ్రామిక లోకం.
డాక్టర్ ఎన్.గోపి
93910 28496