చీకట్లను చిదిమి
వెన్నెల వన్నెలు వొలికినట్లు..
నింగి వీడి వేల తారలు
వరుసగట్టి నేల వాలినట్లు..
దేవభూమిని విడిచి
లక్ష్మీ ఇల నడయాడినట్లు..
కష్టాల కనీళ్లు కడతేర్చి
సిరులు కాంతులీనినట్లు..
ఆశ్వయుజ అమావాస్య వేళలో
అంబరాన్నంటేను దీపాల వేడుక
ఆనందాలు వెల్లివిరిసెను హృదిలో..
దుష్ట వధతో సత్యభామ విజయం
చెడు మీద మంచి గెలిచిన తరుణం
వాడవాడలా బాణసంచా మోతలు
ఊరు ఊరంతా ఉత్సాహ జాతరలు..
మామిడి తోరణాల ద్వారాలు
ముగ్గులతో ముస్తాబైన వాకిళ్లు
నవ్య వస్ర్తాలంకరణతో పిల్లలు
దరహాసాలతో యువ తరంగాలు
పిండివంటల ఘుమఘుమలతో
లోగిల్లు సుందర నందన వనాలు..
నిష్టాగరిష్ఠ అష్టలక్ష్మీ పూజలు
నోములు.. హోమాలు.. వ్రతాలు
ధూపదీప నైవేద్య సమర్పణలు
భక్తి విశ్వాసాలకు సాక్షాత్కారాలు..
సమైక్య జీవనవేదిక
స్వేచ్ఛా శాంతుల ప్రతీక
వెలుగు దివ్వెల వేడుక
వైభవంగా జరుపుదాం
మన సంస్కృతిని
జగతిన చాటుదాం
కోడిగూటి తిరుపతి
95739 29493