‘కోటి మందార పుష్పాల తోట వోలె/ దీపికా తోరణమ్ములు తేజరిల్లె/ యుగయుగమ్ముల చీకటి పొగల అరలు/ తగులబడిపోయె దీపాల సెగలలోన’ అంటూ దీపావళిని యుగయుగాల అంధకారాన్ని తొలగించి వెలుగు రేఖలు ప్రసరింపజేసే అభ్యుదయానికి నాందిగా అభివర్ణించారు దాశరథి. పురాణాల్లో కూడా దీపావళిని ‘అంధకారంపై వెలుగు, అజ్ఞానంపై జ్ఞానం, చెడుపై మంచి సాధించిన విజయం’గానే పేర్కొంటారు. దీపావళి దేశమంతా కూడబలుక్కున్నట్టుగా ఆనందోత్సాహాలతో జరుపుకొనే గొప్ప పర్వదినం. హిమాలయాల పాదం నుంచి హిందూ మహాసముద్ర జలాలతో పునీతమయ్యే దక్షిణ ద్వీపకల్పం చివరి అంచు వరకు నేడు దీపాలతో ధగధగలాడుతూ కనిపిస్తుంది. ప్రతి ఇంటా పండుగ వాతావరణం పరిమళిస్తూ ఉంటుంది. భారతీయ మనస్తత్వంలో దీపానికి, కాంతికి ఉండే ఆరాధనా భావానికి ప్రతీకలు దీపావళినాడు కొలువుదీరే దీపకాంతులు. తూరుపున ఫిజీ, మలేషియా, సింగపూర్ మొదలుకొని మారిషస్ మీదుగా పశ్చిమాన గయానా, ట్రినిడాడ్, టొబాగో వరకూ- ఖండాంతరాలలో భారతీయులు ఎక్కడున్నా, ఆ ప్రాంతాలన్నీ ఈ రోజు జిగేలుమంటూ ఉంటాయి. భారతీయతను చాటుతూ ఉంటాయి.
పురాణకాలం నుంచే దీపావళి జరుపుకొనే సంప్రదాయం వెలుగులీనుతున్నది. తొలి సహస్రాబ్ది ఆరంభంలో రూపొందిన పద్మపురాణ, స్కంధపురాణాల్లో ఈ దివ్వెల పండుగ గురించి వర్ణించారు. ఏడో శతాబ్దం నాటి సంస్కృత నాటకం ‘నాగానంద’లో దీపావళిని హర్షుడు దీపప్రతిపాదోత్సవ అని ప్రస్తావిస్తాడు. 9వ శతాబ్దం నాటి కావ్యమీమాంసలో దీపమాలిక అని అభివర్ణించారు. ఈ విధంగా వేల ఏండ్లుగా కొనసాగుతున్న దీపావళి నిజంగానే ఒక అవిచ్ఛిన్న సంప్రదాయానికి సంకేతంగా నిలుస్తూ యుగయుగాల చీకట్లను పారదోలుతున్నది. యువతులను చెరబట్టిన నరకాసురుడి సంహారం అనంతరం ప్రజలు దీపాలతో ఇళ్ళు అలంకరించుకొని ఉత్సవాలు జరుపుకొన్నారనీ, ఇది చెడుపై మంచి సాధించిన విజయమని చెబుతారు. దీపావళి నాడు లక్ష్మీదేవి పూజ చేయడం కూడా ఆనవాయితీ.
వ్యవసాయాధార సమాజాలలో పంట చేతికి రావడమే పండుగ. తెలంగాణలో వరికోతలు సాగి పంట ఇంటికి వచ్చే సందర్భమిది. అందుకే దసరా, దీపావళి పండుగలు ఇక్కడి సమాజంలో దేదీప్యమానంగా వెలుగుతుంటాయి. తెలంగాణ సమాజం ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకొంటున్న కాలమిది. సాగునీటి కష్టాలు తీరి వ్యవసాయం వేడుకలా మారింది. నగరాలకు దీటుగా గ్రామాలలో లక్ష్మీదేవి కొలువై ఉన్న ఆనందం ప్రజలలో కనిపిస్తున్నది. ఈ సందర్భాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకొందాం. తెలంగాణ దీపకాంతులను ప్రపంచమంతా ప్రకాశింపజేద్దాం.