రాష్ట్ర ప్రభుత్వం ‘దళితబంధు’ పథకాన్ని ప్రవేశపెట్టిన సందర్భాన్ని, దాని అమలుకు ప్రభుత్వం చేస్తున్న క్రమాన్ని చూస్తున్నప్పుడు నేటి దళిత సమస్యపైన ప్రత్యేకంగా విశ్లేషణాత్మకంగా రాయవలసింది ఉన్నదనిపించింది. దీనికి కారణమూ ఉంది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో CDAST అంటే Centre for Dalit, Adivasi Studies and Translation శాఖ ఉంది. నేను ప్రస్తుతం ఇందులో విజిటింగ్ ఫ్రొఫెసర్‌గా చేస్తూనే ఒక రీసెర్చ్ ప్రాజెక్టును చేపట్టి గడిచిన రెండేండ్లుగా పనిచేస్తున్నాను. ఈ ప్రాజెక్టు The Madigas of Telangana, A Study of Socio-Cultural Transformation. తెలుగులో దీని పేరు ‘తెలంగాణ మాదిగలు, వారి సామాజిక, సాంస్కృతిక పరిణామాల అధ్యయనం’. ఈ ప్రాజెక్టు పూర్తిగా క్షేత్ర పరిశోధన ఆధారంగా చేసేది.
దళిత కుటుంబాలు ఆర్థికంగా ఎప్పుడైతే స్వావలంబన సాధిస్తాయో వారికి ఒక సామాజిక ఉన్నతిని కల్పిస్తుంది. స్వావలంబన, ఆర్థిక ఉన్నతి, గౌరవనీయమైన సామాజిక జీవనం ఈ మూడు దళితబంధు పథకం ద్వారా సాధ్యం. ఈ దళితబంధు సామాజిక విప్లవం అన్ని జిల్లాల్లో ప్రతి కుటుంబానికి అందేలా సమీప భవిష్యత్తులో చేరినప్పుడు ఇది దళిత సామాజిక సమానత్వ సాధన అవుతుంది.
క్షేత్రస్థాయి అధ్యయనంలో భాగంగా తెలంగాణలోని పది జిల్లాల్లో పరిశీలించటానికి ప్రణాళిక వేసుకున్నాం. పాత పది జిల్లాలనే యూనిట్‌గా ఒక్కో జిల్లాలో పది, పదిహేను గ్రామాలను, గూడేలను ఎంపిక చేసుకున్నాం. ఇప్పటికి ఎనిమిది జిల్లాల్లో క్షేత్రపరిశోధన పూర్తయింది. సుమారు 108 గ్రామాల్లోని గూడేలను అధ్యయనం చేశాం. అక్కడున్న మాదిగ స్త్రీ, పురుషులను, వేర్వేరు వృత్తివారిని, మాదిగ ఉప కులాలలోని వివిధ జానపద కళాకారులను కలిసి మాట్లాడాం. ఇంకా రెండు జిల్లాలు మహబూబ్‌నగర్, రంగారెడ్డి మిగిలాయి. ఈ అధ్యయన విషయాలను పరిశీ లిస్తే ‘దళితబంధు’ పథకం ఎంత ముఖ్యమైనదో అవసరమైనదో తెలుస్తుంది.
ఈ పరిశోధన మాదిగలకు చెందినదే అయినా మేం తిరిగిన గూడేలలో, గ్రామాల్లో మాలల పరిస్థితిని కూడా చూశాం. ఇక్కడ ముఖ్యమైనవాటినే చర్చించి ‘దళిత బంధు’ ఎంత అవసరం, అది దళితులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, అది ఒక సామాజిక విప్లవానికి ఎలా దారి తీస్తుందో చర్చిస్తాను. మాదిగ గూడేలలో ప్రధానంగా వచ్చిన మార్పులు.. మొదటగా చెప్పవలసిందేమంటే మాదిగలకు వారి ఉపకులాలకు గ్రామాల్లోని వేర్వేరు కులాలకు మధ్యన సాంఘిక సంబంధాల్లో చాలా మార్పులు వచ్చాయి. కులాల మధ్య సఖ్యత కనిపించింది. అంటరానితనం అన్నది ఒక సామాజిక సమస్యగా కనిపించలేదు. గ్రామంలో ఏదైనా పెండ్లి, ఉత్సవాలు జరిగినప్పుడు గూడేలలోని వారిని ఆహ్వానిస్తున్నారు. మాదిగల ఇండ్లలోని పెండ్లికి ఇతర కులాల వారు కూడా వచ్చి సహపంక్తి భోజనాలు చేస్తున్నారు. మాదిగల ఇండ్లల్లో పెళ్లిళ్లులు బ్రాహ్మణ పంతుళ్లు చేయిస్తున్నారు! ఇంతకుముందు మాదిగల పెండ్లిని బైండ్లవారు చేసేవారు. కానీ ఇప్పుడు బ్రాహ్మణులే చేయటం గమనార్హం. ఇది చెప్పుకోదగిన సామాజిక శుభపరిణామం.
నేను గత యాభై ఏండ్లుగా మాదిగ గూడేలు ఎలా ఉన్నాయో చూస్తున్నాను. తాటాకు, చొప్ప గుడిసెలు, తోలు ఊనులందలు. మట్టిగోడలు, మాసిపోయినగోడలు, చినిగిన బట్టలు, మురికి వీధులను చూశాను. మంచి నీటి సౌకర్యాలు లేక ఊరబావికో, చెరువుకో పోయి నీళ్లు తెచ్చుకొనే దైన్యం ఒకప్పుడు ఉండేది.
తెలంగాణలో ఇప్పుడు ఏ జిల్లాలోనూ ఈ పరిస్థితి లేదు. ప్రతి గూడేనికి కాలనీలు వచ్చాయి. పక్కా ఇండ్లు కనిపించాయి. సీసీ రోడ్లు ఏర్పడ్డాయి. విద్యుత్తు, ఓవర్‌హెడ్ ట్యాంకులతో మంచినీటి సౌకర్యం వచ్చింది. ఒక్క ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం పాత గుడిసెలతో ఉన్న గూడేలు మూడు కనిపించాయి.
సమకాలీనంగా.. తెలంగాణ దళితుల లో వృత్తిపరంగా చాలా మార్పులొచ్చా యి. చర్మకార వృత్తి పూర్తిగా అంతరించింది. నల్గొండ జిల్లాలో ఒకే గ్రామంలో రెండు కుటుంబాలు ఇంకా చెప్పులు కుట్టే వారు కనిపించారు. ఇది తప్ప ఏ జిల్లాలోనూ చెప్పులు కుట్టేవారు కనిపించలేదు. చనిపోయిన పశువులను తీసుకుపోవడం, చర్మాన్ని తీసి నానబెట్టి తోలు తయారు చేయడం ఆగిపోయింది. ఇప్పుడు మాదిగ వృత్తిలో ఒకటే మిగిలింది, అది డప్పులు కొట్టే కళ. వారి డప్పులకు కూడా కొత్తగా ఫిల్మ్‌లు వేస్తున్నారు. ఎక్కువమంది వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో బీడీకార్మికులుగా మహిళలు కనిపించారు.
దళిత యువత ఎక్కువగా పదోతరగతి, ఇంటర్ వద్దనే చదువు ఆపేశారు. డిగ్రీ, ఉన్నత విద్యను చదివినవారు పది శాతంలోపే ఉన్నారు. యువత నిరుద్యోగ సమస్యతో సతమతమవుతున్నది. డిగ్రీ చదివిన వారు కూడా ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో క్వారీ పనులు చేస్తున్నారు. ఉన్నత చదువున్నవారు ఎందరో పట్టణాలకు పోయి గుమస్తాలుగా ఉన్నారు.
ఈ సమస్యలన్నింటిని చూసినప్పుడు ‘దళితబంధు’ పథకం దళితుల పాలిట వరమవుతుంది. ‘దళితబంధు’ పథకం ఒక సామాజిక ఉన్నతిని కల్పించే సాధనంగా కనిపిస్తున్నది. గ్రామీణ దళిత నిరుద్యోగులకు జీవనోపాధి మాత్రమే కాదు, సగర్వంగా సమాజంలో నిలబడటానికి ఒక ప్రాణాధారంగా మారుతుంది. దళిత బంధు ఒక సామాజిక విప్లవానికి మార్గం అవుతుంది.
ప్రొఫెసర్
పులికొండ సుబ్బాచారి
94404 93604