మలిదశ తెలంగాణ ఉద్యమంలో మొదటి శ్రేణి కళాకారుడు జంగ్ ప్రహ్లాద్. 1997లో మలిదశ తెలంగాణ ఉద్యమానికి భువనగిరిలో అడుగులు పడిన ప్రారంభ రోజుల నుంచి తెలంగాణ పాటే ప్రాణంగా బతికినవాడు ప్రహ్లాద్. రాష్ట్ర సాధనోద్యమంలో సాగిన అన్ని ఆందోళనల్లో ముందువరుసన నిలిచి తెలంగాణ గోసను గొంతెత్తి పాడాడు. 1999 నుంచి 2003 దాకా తెలంగాణ ఉద్యమంలో పూర్తికాలం కార్యకర్తగా, సాంస్కృతిక సైనికుడిగా పాల్గొన్నాడు. ఉద్యమకాలంలో ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా ఉద్యమ పాట, బాట విడువని నిఖార్సయిన తెలంగాణ సాంస్కృతిక సైనికుడు జంగ్ ప్రహ్లాద్.
భువనగిరి మండలం హనుమాపురంలో సాధినేని ధర్మయ్య, రాంబాయమ్మకు కలిగిన ఏడుగురు కొడుకుల్లో చివరివాడు ప్రహ్లాద్. హనుమాపురంలోనే పాఠశాల విద్య పూర్తిచేసి, భువనగిరి గంజ్ హైస్కూల్లో పదో తరగతి దాకా చదివాడు. చదువులో మేటి విద్యార్థిగా నాటి విద్యార్థి లోకంలో, ఉపాధ్యాయుల్లో ప్రేమాభిమానాలు చూరగొన్నాడు. ప్రహ్లాద్ తండ్రి సాధినేని ధర్మయ్య స్వాతంత్య్ర సమరయోధుడు. కమ్యూనిస్టు పార్టీ నేత. చిన్ననాటి నుంచి ప్రగతిశీల భావాలను పునికిపుచ్చుకున్న ప్రహ్లాద్ పాఠశాల రోజుల నుంచి గాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇంటర్ విద్య కోసం హైదరాబాద్ చేరుకొని చదువుకొనే క్రమంలో సహజంగానే విప్లవ విద్యార్థి సంఘాల ప్రభావంతో మంచి గాయకుడిగా, కళాకారుడిగా ఎదిగాడు.
విద్యార్థి దశ నుంచి ప్రజా సమస్యలపై రచనలు చేస్తూ గోశి, గొంగడి కట్టి సాంస్కృతిక కళాకారుడిగా ప్రదర్శనలిచ్చాడు. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన కాన్నుంచి తెలంగాణ ఉద్యమమే జీవితంగా ఊరూరూ తిరుగుతూ ప్రదర్శనలిచ్చాడు. తెలంగాణవ్యాప్తంగా జరిగిన ధూంధాం కార్యక్రమాల్లో రసమయి బాలకిషన్‌తో కలిసి ప్రదర్శనలు ఇచ్చాడు. తెలంగాణ ప్రధాన సమస్య అయిన కరువు, నీటి సమస్య, ఫ్లోరిన్ తదితర సామాజిక, సాంఘిక సమస్యలపై రచనలు చేసి గానం చేశాడు. తెలంగాణ ఉద్యమం అన్ని మలుపుల్లో ప్రధాన భూమిక పోషించాడు ప్రహ్లాద్.
ఈ క్రమంలోనే తాను రాసి, గానం చేసిన పాటలతో ఓ ఆల్బమ్ ‘జంగ్’ పేరుతో విడుదల చేశాడు. ఆ పాటల్లో తెలంగాణ ప్రాంతం ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక వివక్ష, అణచివేతలు, వలసాంధ్ర పాలకుల వివక్షను ఎత్తిచూపాడు. తెలంగాణ ఎదుర్కొంటున్న సకల సమస్యలకు పరిష్కారం తెలంగాణ సాధన ఒక్కటే పరిష్కార మార్గమని చాటిచెప్పాడు. ఈ ఆల్బమ్‌కు ప్రజల్లో మంచి ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలోంచే.. సాధినేని ప్రహ్లాద్.. జంగ్ ప్రహ్లాద్ అయ్యాడు. ఆ తర్వాత కాలంలో ‘సైరన్’ పేరుతో మరో పాటల ఆల్బమ్ తీశాడు. ఇది కూడా ప్రజల నాలుకల్లో నిలిచింది.
జంగ్ ప్రహ్లాద్ రాష్ట్రసాధన కోసం అహర్నిశలు కలగన్నాడు. కార్యసాధకుడిగా ఉద్యమించాడు. తెలంగాణ సాంస్కృతిక కళాకారుడిగా పగలూ రాత్రి తిరుగుతూనే తన చిన్ననాటి మిత్రులందరితో మంచి స్నేహసంబంధాలను కొనసాగించాడు. వ్యక్తిగతంగా తెలంగాణ ఉద్యమాన్ని సమర్థించని మిత్రులతోనూ తెలంగాణ ఎందుకు అవసరమో ఒప్పించి మెప్పించిన విశిష్ట వ్యక్తిత్వం ప్రహ్లాద్ది.
ఈ సుదీర్ఘ జీవనయానంలో జగద్గిరిగుట్టలో స్థిరపడిన ఆయనది సగటు జీవితమే. ఆకాశాన్నంటేట్టుగా గొంతెత్తి పాటలు పాడినా.. ఆస్తిపాస్తులేమీ సంపాదించలేదు. పూట గడువటమే కష్టంగా ప్రహ్లాద్ జీవించాడు. తెలంగాణ పాటే ప్రాణంగా జీవించిన జంగ్ ప్రహ్లాద్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి దవాఖానపాలయ్యాడు. నాలుగురోజులు మృత్యువుతో పోరాడిన ఆయన గొంతు మూగబోయింది. యావత్ తెలంగాణ మరో గొప్ప కళాకారున్ని కోల్పోయింది. ఈ సందర్భం గా ఆయనకు నివాళులు…