కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత ఏడాది నుంచి ఇంజినీరింగ్, ఇతర సాంకేతిక, ఉన్నత విద్యా కోర్సులన్నింటినీ రాష్ర్టాల ప్రాంతీయ భాషల్లోనే విద్యా బోధన చేయటం కోసం ఆయా బోధనా అంశాలన్నింటినీ ఆ రాష్ట్ర భాషల్లోకి అనువదింపజేసే బృహత్తర పథకం ప్రారంభించింది. ఈ ప్రయత్నం విజయవంతమవుతుందా లేదా అన్న విశ్లేషణ చాలా అవసరం.
దురదృష్టమేమంటే ఈ రోజుకీ విద్యారంగంలో సరైన భాషా బోధనా సిద్ధాంతాలను ప్రభుత్వాలు పాటించటం లేదు. ఇక ఇప్పుడు ప్రధాని అన్ని ఉన్నత విద్యారంగ కోర్సులు మాతృభాషలలోనే బోధించాలని నిర్ణయించటం విద్యావ్యవస్థను పెనం మీదినుంచి పొయ్యిలోకి తొయ్యటమే!
వెయ్యేండ్ల బానిసత్వం విడిపించుకొని భారతదేశం స్వాతంత్య్రం సాధించాక దేశంలో పెద్ద సమస్యల గురించి ఆలోచించిన కాంగ్రెస్ ప్రభుత్వం, దాదాపు ఏడు దశాబ్దాలు సరైన విద్యావిధానం పాటించలేదనే ఒప్పుకోవాలి. ఎందుకంటే, నెహ్రూ ప్రభుత్వం మొట్టమొదట ఎదుర్కోవలసిన సమస్యగా భాషా సమస్య నిలిచింది. విదేశీ దండయాత్రలకు ముందు వివిధ రాజ్యాలుగా ఉన్న భారతావనిలో వివిధ భాషలు పుట్టి, పెరిగి పరిఢవిల్లాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో భాష, దాని సాహిత్యం, సంస్కృతులు రూపుదిద్దుకున్నాయి. దాంతో అసలు ‘రాష్ట్ర భాష’ను నిర్ణయించటానికే చాలా కష్టపడ్డారు. ఆ సందర్భంలో ఈ దేశ పూర్వచరిత్ర, సంస్కృతి, పురాతన భాష అయిన సంస్కృతాన్ని గుర్తించవలసింది. ప్రతి రాష్ట్రంలో సంస్కృతం, మాతృభాష, అంతర్జాతీయ భాష అయిన ఇంగ్లీష్ గనక పాఠశాలల్లో ప్రవేశపెట్టి ఉంటే దేశ సమగ్రత కాపాడబడేది.
సంస్కృ తం చదవటం ఇష్టంలేని వారికి వారి మాతృభాషతో పాటు మరో భారతీయ భాష, ఇంగ్లీష్ చదివే అవకాశం కల్పించవలసింది. కానీ అది జరగలేదు. భారతీయ సంస్కృతి మీద ఆదరణ, గౌరవం లేక, విదేశాల్లో చదువుకున్న నెహ్రూ గుడ్డిగా సంస్కృతాన్ని కాలదన్ని బ్రిటిష్ విద్యావేత్త మెకాలే కలలను నిజం చేశాడు. ‘భారతీయు లు రూపంలో మాత్రమే ఈ దేశస్థులు, వారిని మనకు బానిసలుగా చేసుకోవాలంటే మానసికంగా వారిని వారి సంస్కృతికి దూరం చేయాలి. మన సంస్కృతి, భాషలు గొప్పవని నమ్మకం కలిగించాలి. వారిని వారి మూలభాష సంస్కృతం నుంచి దూరం చేయాలి’ అని స్పష్టంగా చెప్పిన మెకాలే మాటలే నిజమయ్యాయి. హిందీని రాష్ట్ర భాష చేయటంతో దక్షిణాది రాష్ర్టాలు దూరమయ్యాయి. చివరికి అందరికీ ఇంగ్లీషే గతి అయ్యింది. పూర్తి దేశానికి ఒక భాష లేకుండాపోయింది. కారణాలు ఇంకా ఉన్నాయి. అవి-
1.నెహ్రూ నిర్ణయించిన రాష్ట్ర భాష. 2.నెహ్రూ ప్రభుత్వం అనుసరించిన విదేశీ విద్యావ్యవస్థ. 3.కనీసం మాతృభాషల్లో బోధన జరిపే రాష్ర్టాలలో కూడా ఆయా భాషల మీద, బోధనా పద్ధతుల మీద పరిశోధనలు జరగకపోవటం. 4.ప్రతి రాష్ట్రంలోనూ విద్యారంగ నిపుణులను తయారుచేయటానికి ఏ ప్రయత్నాలు చేయకపోవటం. 5.అందరికీ ఆమోదయోగ్యమై తప్పనిసరి భాషగా పాఠశాల స్థాయి నుంచీ బోధింపబడిన ఇంగ్లీష్‌ను ఒక భాషగా గుర్తించక అంతకుపూర్వం ఉన్న పద్ధతుల్లోనే బోధించటం. 6.అసలు ఇంత భాషా వైవిధ్యం ఉన్న దేశంలో స్థానిక భాషల మీద గానీ, అనువాద నైపుణ్యాల మీద గానీ పరిశోధనలు జరగకపోవటం. 7. మొత్తమ్మీద విద్యావ్యవస్థలో విద్యార్థుల వైవిధ్యాలు, నైపుణ్యాలు గుర్తించే వ్యవస్థ లేక కేవలం పరీక్షలు పాసవడం మీదే ఉపాధ్యాయులు, విద్యార్థుల ప్రతిభ గుర్తించడం. 8. దేశంలోని వైవిధ్యాలను గుర్తించకుండా గుడ్డిగా పాశ్చాత్య దేశాల విద్యావిధానాన్ని రుద్ది, పాఠశాల కిందిస్థాయిలో భాషలు నేర్చుకునేముందే సామాజిక, విజ్ఞానశాస్ర్తాల వంటి సబ్జెక్టులు ప్రవేశపెట్టడం.
దురదృష్టమేమంటే ఈ రోజుకీ విద్యారంగంలో సరైన భాషా బోధనా సిద్ధాంతాలను ప్రభుత్వాలు పాటించటం లేదు. ఇక ఇప్పుడు ప్రధాని అన్ని ఉన్నత విద్యారంగ కోర్సులు మాతృభాషలలోనే బోధించాలని నిర్ణయించటం విద్యావ్యవస్థను పెనం మీదినుంచి పొయ్యిలోకి తొయ్యటమే! కారణాలు ఇవి-
1. స్వాతంత్య్రానంతరం రాష్ర్టాల్లో మాతృభాషలుగా ఉన్నవాటి మీద, ఆయా భాషలలో బోధనాంశాలు, పద్ధతుల మీద పరిశోధన జరగక విద్యార్థుల్లో భాషా నైపుణ్యాలు కొరవడ్డాయి. ఈ కారణం చేత ఇప్పుడు ఉన్నత విద్య వారి మాతృభాషలో అందించినా వారికి విజయం కలుగుతుందని ఆశించలేం!
2.వివిధ రాష్ర్టాల భాషల నుంచి ఇంగ్లీష్, హిందీలోకి, లేక ఆ భాషల నుంచి విద్యార్థుల భాషల్లోకి పాఠ్యాంశాలు అనువదించదగిన విద్యావేత్తలు లేకపోవడం. ఎందుకంటే గత 70 ఏండ్ల విద్యావ్యవస్థలోని లోపాల వల్ల ఇంగ్లీష్, మాతృభాషలపై పూర్తి పట్టు ఉండి అనువదించగలిగిన సామర్థ్యం ఉన్నవారు తగినంత మంది ఏ రాష్ట్రంలోనూ లేరు.
3.చైనా, జపాన్ వంటి దేశాలు విద్యను తమ భాషల్లో నే అందించినా, అవసరమైనవారికి ఇంగ్లీష్ కోర్సులు అందిస్తాయి. అయితే, వారు మనలాగ కాకుండా, భాషా నైపుణ్యాలను బోధించే పద్ధతులు అనుసరిస్తారు. కాబట్టి చదువైపోయిన తర్వాత కూడా ఒక డాక్టరో, ఇంజినీరో, సైంటిస్టో ఆరు నెలల నుంచి ఏడాదికాలం కష్టపడి ఇంగ్లీష్ నేర్చుకుంటాడు. మన దేశంలో ఎక్కడా ఇంగ్లీష్‌ను కేవలం భాషగా నేర్పించే పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు లేవు. ఆ అవసరాన్ని గుర్తించిన పూర్వ ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో 16 ఇంగ్లీష్ లాంగ్వేజీ టీచింగ్ సెంటర్లు యూనివర్సిటీల పరిధుల్లో స్థాపిస్తే, మన ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లు ఆ సంస్థలను కష్టపడి మూయించేశాయి. ఎందుకంటే వారు ఇంగ్లీష్ సాహిత్యం మాత్రమే బోధించగలరు కాబట్టి.
ఈ కారణం వల్ల ఇంగ్లీష్ పాఠ్యాంశాలు, బోధన, పరీక్షా పద్ధతులు మార్చితేగానీ ఆ భాషలోంచి అనువదించగలిగిన నిపుణులు పెరగరు. ఈ కారణాల వల్ల అసలే వెనుకబడి ఉన్న భారతీయ విద్యా వ్యవస్థ మోదీ నిర్ణయంతో పూర్తిగా నాశనమవుతుంది.
–కనకదుర్గ దంటు 89772 43484