నాగరికత నదీతీరాల్లో పుడితే
అభివృద్ధి నదీ లక్షణమున్న
నాయకుల పాలనలో పుడుతుంది
నది పుట్టినప్పుడు
బిందువులెక్కనే కనబడ్తది
రాళ్లు, రప్పలు… పిచ్చి మొక్కలు అడ్డుకుంటామని విర్రవీగుతాయి
నది నడక మొదలుపెట్టిందా
దట్టమైన వనాలు
ఎత్తయిన పర్వతాలు
చెలికత్తెలై స్వాగతం పలుకుతాయి
రాళ్లు, రప్పలు, పిచ్చి మొక్కలు
తమ బతుకు మీద విరక్తి చెంది
జీవచ్ఛవాలవుతాయి
వెక్కిరించిన నాలుకలు
కుక్కిన పేనులవుతాయి
విర్రవీగి నది నుంచి
బయటపడ్డ చేపలు
విలవిలలాడటం తప్ప ఏం చేస్తాయి!
భూమిని పచ్చగా మారుస్తూ
సకల జీవాల బువ్వకు ప్రాణం పోస్తూ
నది తృప్తిగా, నిరహంకారంగా
రాజసంతో ప్రవహిస్తూనే ఉంటది
నది లెక్కనే నాయకునికి
కులమతాల పట్టింపు ఉండదు
నది పాపాలను తొలగిస్తే
నాయకుడు ప్రజల శాపాలను తీసేస్తాడు
నదికీ నాయకునికీ రైతే తొలిమిత్రుడు
రైతు మెచ్చుకున్నదే జీవనది
రైతు మెచ్చుకున్న నాయకుడే మహారథి
ఎన్ని రత్నాలున్నా
సముద్రుడు నది కాలేడు
ఎంత విశాలమైన ఛాతి ఉన్నా
వ్యాపార మనస్వి
ఎన్నడూ నాయకుడు కాలేడు
ఉప్పు సముద్రం లెక్కనే
తియ్యని నదుల్ని మింగుతూ ఉంటాడు
దేశానికి ఇప్పుడు
నది లాంటి నాయకుడు కావాలి
నదులకు జన్మనిచ్చిన గంగ్రోత్రి లాగా..
నాసికా త్రయంబకం లాగా…
నా తెలంగాణ నాయక జననిగా
కీర్తిని పొందాలి
– ఘనపురం దేవేందర్